Finance : మాజీ సైనికోద్యోగుల పిల్లల పెళ్లికి రూ.లక్ష
Finance : దేశ సేవలో జీవితాన్ని అర్పించిన మాజీ సైనికులు, వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం గొప్ప బహుమతి ప్రకటించింది. రక్షణ శాఖ తాజాగా పెన్షన్ అర్హత లేని మాజీ సైనికోద్యోగులకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని 100 శాతం పెంచే ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది
- By Sudheer Published Date - 10:41 AM, Thu - 16 October 25

దేశ సేవలో జీవితాన్ని అర్పించిన మాజీ సైనికులు, వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం గొప్ప బహుమతి ప్రకటించింది. రక్షణ శాఖ తాజాగా పెన్షన్ అర్హత లేని మాజీ సైనికోద్యోగులకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని 100 శాతం పెంచే ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు నెలకు రూ. 4,000గా ఉన్న పెనూరీ గ్రాంట్ (Pecuniary Grant)ను రూ.8,000కి పెంచింది. ఈ నిర్ణయం వేలాది మాజీ సైనిక కుటుంబాలకు ఊరటనిచ్చింది. ముఖ్యంగా చిన్న ర్యాంకులలో పనిచేసి రిటైర్ అయినా, లేదా సర్వీస్ కాలం తక్కువగా ఉండి పెన్షన్‌కు అర్హత పొందని ఉద్యోగులకు ఇది గొప్ప ఉపశమనం కానుంది.
Diwali: దీపావళి రోజు ఏ దీపాలను వెలిగించాలి.. నూనె, నెయ్యి.. దేనిని ఉపయోగించాలో తెలుసా?
ఇకపుడు ఈ పథకం కింద మాజీ సైనికుల భార్యలు (విధవులు) కూడా ప్రయోజనం పొందనున్నారు. పెన్షన్ లేకుండా జీవిస్తున్న, 65 ఏళ్లు పైబడిన విధవలకు నెలకు రూ.8,000 చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు. వీరిలో ఆదాయం లేని మహిళలకు ఇది అత్యవసర సహాయంగా ఉపయోగపడనుంది. అదనంగా, మాజీ సైనికుల పిల్లల విద్యా సహాయం కూడా పెంచారు. ఇప్పటి వరకు నెలకు రూ.₹1,000గా ఉన్న చదువుకు ఇచ్చే సాయం ఇప్పుడు రూ.2,000కు పెరిగింది. ఈ నిర్ణయం పిల్లల విద్యాభారం తగ్గించడమే కాకుండా, సైనిక కుటుంబాల్లో విద్యాపట్ల ప్రోత్సాహాన్ని పెంచుతుందని నిపుణులు అంటున్నారు.
మరో ముఖ్యమైన నిర్ణయంగా, మాజీ సైనికుల కుమార్తెల వివాహానికి ఇచ్చే ఆర్థిక సాయాన్ని ₹50,000 నుండి రూ.1 లక్షకు పెంచారు. ఈ సవరణలు మాజీ సైనిక సంక్షేమ విభాగం (Department of Ex-Servicemen Welfare) సూచనల మేరకు అమల్లోకి రానున్నాయి. రక్షణశాఖ ఈ పథకాన్ని దేశ రక్షణలో సేవలందించిన కుటుంబాల పట్ల ప్రభుత్వ కృతజ్ఞతగా పేర్కొంది. ఈ సాయం పెంపుతో చిన్న సైనిక కుటుంబాలు ఆర్థికంగా బలపడతాయని, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మాజీ సైనిక కుటుంబాలకు ఇది పెద్ద ఊరటగా మారనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నిర్ణయం భారత సైనికుల పట్ల ప్రభుత్వ సానుభూతి మరియు గౌరవానికి ప్రతీకగా పరిగణించబడుతోంది.