Train Accident: కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్.. ఘోర రైలు ప్రమాదానికి కారణమిదేనా..?
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో శుక్రవారం (జూన్ 2) సాయంత్రం ఘోర రైలు ప్రమాదం (Train Accident) జరిగింది. హౌరా వెళ్తున్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన పలు కోచ్‌లు పట్టాలు తప్పడంతో పాటు మరో రైలును ఢీకొట్టింది.
- By Gopichand Published Date - 09:01 AM, Sat - 3 June 23

Train Accident: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో శుక్రవారం (జూన్ 2) సాయంత్రం ఘోర రైలు ప్రమాదం (Train Accident) జరిగింది. హౌరా వెళ్తున్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన పలు కోచ్‌లు పట్టాలు తప్పడంతో పాటు మరో రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 233 మంది మరణించారు. 900 మందికి పైగా గాయపడ్డారు. దీంతో క్షతగాత్రులు ఆసుపత్రుల్లో గుమిగూడారు. గూడ్స్ రైలు, కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, హౌరా ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
Aerial view: Around 233 lives lost in #Odisha train accident. One of the biggest train mishap in the country. #TrainMishap #BalasoreTrainAccident pic.twitter.com/1n7xpC9uJq
— dinesh akula (@dineshakula) June 3, 2023
బాలాసోర్‌లో జరిగిన ఈ ఘటన అందరినీ కలిచివేసింది. ఘటనా స్థలంలో ఎక్కడ చూసినా మృతదేహాలు పడి ఉండడంతో రోదనలు మిన్నంటాయి. కొందరు రైలులో చిక్కుకోగా, మరికొందరు పట్టాలపై పడి ఉన్నారు. సహాయక చర్యలు వేగంగా జరుగుతున్నాయి. అటువంటి పరిస్థితిలో గాయపడిన, మరణించిన వారి సంఖ్య నిరంతరం పెరుగుతోంది. సమాచారం ప్రకారం.. గత 12 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నప్పటికీ పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రమాద రైలులో చిక్కుకున్నారు.
కారణమిదేనా..?
ఒడిశా-బహనాగ రైల్వే స్టేషన్ మధ్య లైన్(లూప్ లైన్ర)లో గూడ్స్ రైలు ఆగి ఉంది. వెనక నుంచి వచ్చిన కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు ఆ స్టేషన్‌లో స్టాప్ లేకపోవడంతో మెయిన్ లైన్ ట్రాక్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. కానీ కోరమండల్‌కు లూప్‌లైన్ సిగ్నల్ ఇచ్చారని ఆరోపణ వినిపిస్తోంది. దీంతో మెయిన్ లైన్‌లో వెళ్లాల్సిన కోరమండల్ లూప్‌లైన్‌లో ఆగిఉన్న గూడ్స్‌ను 128కి.మీ వేగంతో ఢీకొట్టింది.
కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
బాలాసోర్ జిల్లాలో జరిగిన ఈ రైలు ఘటనలో బోగీల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు స్థానిక ప్రజలు, రెస్క్యూ బృందాలు ప్రయత్నిస్తున్నాయి. రైల్వే, అగ్నిమాపక దళం, స్థానిక పోలీసు యంత్రాంగంలోని 600 మంది సిబ్బంది రాత్రంతా బోగీల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసి ఆస్పత్రికి తీసుకెళ్తూనే ఉన్నారు. ఈ ప్రమాదం బాలాసోర్‌కు నలభై కిలోమీటర్ల దూరంలోని బహనాగా బజార్ స్టేషన్ సమీపంలో జరిగింది. బహనాగా, బాలాసోర్ నుండి భువనేశ్వర్ వరకు ఉన్న ఆసుపత్రులు క్షతగాత్రులతో నిండిపోయాయి.
రాష్ట్ర సంతాప దినం
ఒడిశాలో జరిగిన ప్రమాదం కారణంగా ప్రభుత్వం జూన్ 3వ తేదీ శనివారం అన్ని కార్యక్రమాలను రద్దు చేసింది. దీంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా సంతాపం ప్రకటించాలని ఆదేశించారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మృతులు, క్షతగాత్రులకు పరిహారం మొత్తాన్ని ప్రకటించారు.