Rahul Gandhi : దేశంలో ఉద్యోగాల కొరతకు మోడీ కారణం కాదా?: రాహుల్‌గాంధీ
Rahul Gandhi : ప్రధాని మోడీ ప్రజలను విభజించి పాలిస్తున్నారనీ, ఒకరిని చూసి మరొకరు అసహ్యించుకునేలా తయారు చేశారని మండిపడ్డారు.
- By Latha Suma Published Date - 07:17 PM, Thu - 26 September 24

Haryana Assembly Election Campaign: లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు చండీగఢ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో నిరుద్యోగ సమస్య తాండవిస్తోందని అన్నారు. ప్రధాని మోడీ .. పక్కా ప్రణాళిక ప్రకారం ఉపాధి రంగాన్ని నిర్వీర్యం చేశారని విమర్శించారు. దేశంలో ఉద్యోగాల కొరతకు మోడీ కారణం కాదా? అని ప్రశ్నించారు. ప్రధాని మోడీ ప్రజలను విభజించి పాలిస్తున్నారనీ, ఒకరిని చూసి మరొకరు అసహ్యించుకునేలా తయారు చేశారని మండిపడ్డారు.
Read Also: Devara Ayudha Pooja Song : దేవర ఆయుధ పూజ సాంగ్ వచ్చేసింది
హర్యానాలో బీజేపీ కుప్పకూలడం ఖాయమని, తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ” కాంగ్రెస్ తుపాను రాబోతోంది. అందులో బీజేపీ కొట్టుకుపోవడం పక్కా. రాష్ట్రాన్ని ఆ పార్టీ సర్వనాశనం చేసింది. అందుకు ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారు. ఇటీవల అమెరికా వెళ్లినప్పుడు అక్కడ ఉంటున్న హర్యానా వాసులను కలిశాను. డల్లాస్, టెక్సాస్‌లో ఒక్కో గదిలో 15 నుంచి 20 మంది ఉన్నారు.
ఇక్కడికెలా వచ్చారని అడిగితే.. హరియాణాలో కనీసం ఉపాధి దొరకడం లేదు. ఎలాగైన బతుకుసాగించాలన్న ఉద్దేశంతో ప్రమాదకర స్థితిలో కజకిస్థాన్, తుర్కియే, దక్షిణ అమెరికా దేశాలు దాటి వచ్చి ఇక్కడ జీవనం సాగిస్తున్నామని చెప్పారు. కొందరు తమ వ్యవసాయ భూమిని విక్రయించి, ఆ డబ్బులతో అమెరికా వెళ్లినట్లు చెప్పారు. ఇక్కడే ఉపాధి అవకాశాలు ఉంటే యువతకు ఇలాంటి గతి పట్టేదా? ప్రజల తలరాతలు మారాంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలి” అని రాహుల్ గాంధీ అన్నారు.