Petrol, Diesel Prices Hiked: బీజేపీ బాదుడు పై.. రాహుల్ షాకింగ్ కామెంట్స్..!
- By HashtagU Desk Published Date - 01:28 PM, Thu - 31 March 22

ఇండియాలో పెట్రోలు, డీజిల్ ధరలు ప్రతిరోజు పెరుగుతున్న సంగతి తెలిసిందే. కర్ర కాల్చి వాత పెట్టినట్లుగా, ఇప్పుడు దేశంలో పేట్రోల్ వాత మంట పుడుతోంది. గత 10 రోజుల్లో 9 రోజులు పెట్రోల్, డీజల్ ధరలు పెరిగాయి దీంతో వామ్మో అంటూ దేశ ప్రజలు గుండెలు బాదుకుంటున్నారు. ఈ క్రమంలో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపధ్యంలో, పార్లమెంట్ ఆవరణలో తాజాగా మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.
దేశంలోని ఇంధన ధరలు నిరంతరంగా పెరిగిపోతుండడం వల్ల పేదలు నేరుగా నష్టపోతున్నారని చెప్పిన రాహుల్ గాంధీ, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం తక్షణమే ధరలను నియంత్రించాలన్నారు. పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ అంశాన్ని లేవనెత్తుతారని, అయితే ప్రతిపక్షాల డిమాండ్‌ను ప్రభుత్వం విస్మరిస్తోందని, వెంటనే పెట్రోలు, డీజిల్ ధరలను ప్రభుత్వం నియంత్రించాలని, లేకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కేంద్ర ప్రభుత్వం పై రాహుల్ గాంధీ అన్నారు.
ఇక దేశంలో పెట్రోలు, డీజిల్ ధరల పెంపునకు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఇతర నాయకులు, కార్యకర్తలు దేశవ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నారని రాహుల్ గాంధీ తెలియజేశారు. గత 10 రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలను తొమ్మిది సార్లు పెంచారని, దీంతో ప్రత్యక్ష ప్రభావం పేద ప్రజలపై పడుతోందని, కాబట్టి ప్రభుత్వం పెరుగుతున్న ధరలను నియంత్రించాలని, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం మానుకోవాలని డిమాండ్ చేశారు. ఈ పెంపుతో ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తోందని, పేదల జేబుకు చిల్లి పెట్టి, ఖజానా నింపుకోవడమే బీజేపీ ప్రభుత్వ ఫార్ములా అని రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు. మరి రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.