Republic celebrations : గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు
2024 అక్టోబర్‌లో ప్రబోవా సుబియాంటో ఇండోనేషియా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. భారత్‌లో ఆయన అడుగుపెట్టడం ఇదే తొలిసారి అని విదేశాంగ శాఖ ప్రకటించింది.
- By Latha Suma Published Date - 05:31 PM, Thu - 16 January 25

Republic celebrations : భారత 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవా సుబియాంటో ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు ఇండోనేషియా అధ్యక్షుడు రిపబ్లిక్ వేడుకలకు హాజరవుతున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో ఇండియాలో ఇండోనేషియా ప్రెసిడెంట్ జనవరి 25, 26 తేదీల్లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారికంగా గురువారం ప్రకటించింది.
ఈ పర్యటన రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచేందుకు దోహద పడుతుందని తెలిపింది. ప్రాంతీయ, ప్రపంచ సమస్యలను చర్చించడానికి అవకాశాన్ని కల్పిస్తుందని విదేశాంగ శాఖ పేర్కొంది. సుబియాంటో 2020లో ఇండోనేషియా రక్షణ మంత్రిగా ఢిల్లీని సందర్శించారు. 2024 అక్టోబర్‌లో ప్రబోవా సుబియాంటో ఇండోనేషియా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. భారత్‌లో ఆయన అడుగుపెట్టడం ఇదే తొలిసారి అని విదేశాంగ శాఖ ప్రకటించింది.
కాగా, 1950 నుంచి భారత్ మిత్ర దేశాల నేతలను గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానించడం సంప్రదాయంగా వస్తోంది. 2007లో పుతిన్(రష్యా), 2008లో నికోలస్ సర్కోజీ(ఫ్రాన్స్), 2015లో బరాక్ ఒబామా (అమెరికా), 2016లో ఫ్రాన్సోయిస్ హౌలన్ (ఫ్రాన్స్)లు అతిథులుగా హాజరయ్యారు. 2021లో నాటి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌ను చీఫ్ గెస్ట్‌గా ఆహ్వానించారు. కానీ, కోవిడ్ కేసులు పెరగడంతో ఆయన పర్యటన రద్దైంది. 2018లో ఆసియాన్ దేశాల అధినేతలను గణతంత్ర దినోత్సవానికి ఆహ్వానించారు. 2023లో ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్ సిసి ముఖ్య అతిథిగా హాజరవ్వగా.. 2024 గణతంత్ర వేడుకలకు భారత ప్రభుత్వం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానియేల్ మక్రాన్ ను ఆహ్వానించింది. 1952, 53, 66ల్లో మాత్రమే విదేశీ అతిథులు లేకుండా రిపబ్లిక్‌డే వేడుకలు నిర్వహించారు.