National Games 2025 : 38వ జాతీయ క్రీడలను ప్రారంభించనున్న ప్రధాని
ఈ ప్రత్యేక వేడుకకు భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పిటి ఉషతో పాటు పలువురు ప్రముఖులు కూడా చేరుకున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 10,000 మందికి పైగా అథ్లెట్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
- By Latha Suma Published Date - 01:34 PM, Tue - 28 January 25

National Games 2025 : ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈరోజు నుండి 38వ జాతీయ క్రీడలు మొదలుకానున్నాయి. కాసేపట్లో ప్రధాని మోడీ వీటిని ప్రారంభించనున్నారు. ఈ క్రీడలు జనవరి 28 నుంచి ఫిబ్రవరి 14 వరకు ఉత్తరాఖండ్‌లోని ఎనిమిది జిల్లాల్లోని 11 నగరాల్లో జరుగుతాయి. 36 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం ఈ జాతీయ క్రీడలలో పాల్గొనబోతున్నాయి. 17 రోజుల పాటు, 35 క్రీడా విభాగాలకు ఈ పోటీలు జరుగుతాయి. వీటిలో 33 క్రీడలకు పతకాలు ప్రదానం చేస్తారు.
ఈ ప్రత్యేక వేడుకకు భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పిటి ఉషతో పాటు పలువురు ప్రముఖులు కూడా చేరుకున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 10,000 మందికి పైగా అథ్లెట్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దేశం నలుమూలల నుంచి వచ్చే 16,000 మందికి పైగా ఆటగాళ్లు, కోచ్‌లు, అధికారులతో కూడిన జట్లు ఇప్పటికే ఉత్తరాఖండ్ చేరుకున్నాయి. యోగా, మల్లఖంబ్‌లను మొదటిసారిగా ఈ జాతీయ క్రీడలలో చేర్చారు. ఈసారి జాతీయ క్రీడలు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ఎంతో ప్రత్యేకం కావడంతో స్థానికంగా ప్రజలతోపాటు అనేక మంది ఈ క్రీడల గురించి ఆసక్తితో ఉన్నారు.
జాతీయ క్రీడలు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహిస్తున్నారు. ఈ వేదికపై నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల నుంచి సహకారాన్ని అందుకుంది. ఈ క్రీడలలో జాతీయ స్థాయిలో ప్రదర్శన ఉన్న 9,000 మంది ప్లేయర్లు తమ ప్రతిభను చూపేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో అన్ని మైదానాలు.. అథ్లెటిక్స్, క్రికెట్ తదితర క్రీడలు నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. అదేవిధంగా, ప్రభుత్వం 1500 మంది వాలంటీర్లను రంగంలోకి దించి ఈ క్రీడలు సజావుగా జరిగేందుకు కృషిచేస్తుంది. రాష్ట్రం బాగా ఎదుగుతున్న నేపథ్యంలో జాతీయ క్రీడల ద్వారా ప్రపంచానికి ఈ ప్రాంతం మరింత గుర్తింపు సంపాదించడానికి ఈ క్రీడలు మైలురాయిగా నిలిచే అవకాశాలు ఉన్నాయి.