Pakistani Boat: భారత జలాల్లో పాక్ బోట్.. డ్రగ్స్, ఆయుధాలు స్వాధీనం
భారత జలాల్లోకి ప్రవేశించిన పాకిస్తాన్ ఫిషింగ్ బోటు (Pakistani Boat)ను కోస్ట్‌గార్డ్స్ అదుపులోకి తీసుకున్నారు. ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు అధికారులు బోటును పట్టుకున్నారు. ఇందులో 10 మంది క్రూ మెంబర్లతో పాటు సుమారు రూ.300 కోట్ల విలువైన ఆయుధాలు (Arms) దాదాపు 40కేజీల డ్రగ్స్ (Drugs)ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
- By Gopichand Published Date - 07:55 AM, Tue - 27 December 22

భారత జలాల్లోకి ప్రవేశించిన పాకిస్తాన్ ఫిషింగ్ బోటు (Pakistani Boat)ను కోస్ట్‌గార్డ్స్ అదుపులోకి తీసుకున్నారు. ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు అధికారులు బోటును పట్టుకున్నారు. ఇందులో 10 మంది క్రూ మెంబర్లతో పాటు సుమారు రూ.300 కోట్ల విలువైన ఆయుధాలు (Arms) దాదాపు 40కేజీల డ్రగ్స్ (Drugs)ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. తదుపరి విచారణకు బోటును ఓఖాకు తరలిస్తున్నట్లు కోస్ట్ గార్డు తెలిపింది.
గుజరాత్ ఏటీఎస్, ఇండియన్ కోస్ట్ గార్డ్ (ఐసీజీ) సంయుక్త బృందం భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన పాకిస్థాన్ బోటును స్వాధీనం చేసుకుంది. ఈ బోటు నుంచి దాదాపు రూ.300 కోట్ల విలువైన ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, దాదాపు 40 కిలోల డ్రగ్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. పాకిస్థానీ బోటులో ఉన్న పది మందిని అరెస్ట్ చేశారు. ఏటీఎస్ ఇచ్చిన నిఘా సాయంతో ఈ పడవను పట్టుకున్నారు. నివేదికల ప్రకారం.. ఇండియన్ కోస్ట్ గార్డ్‌కు గుజరాత్‌లోని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) నుండి ఇంటెలిజెన్స్ అందింది. దీని ఆధారంగా రాత్రి సమయంలో ICG వ్యూహాత్మకంగా దాని వేగవంతమైన పెట్రోలింగ్ నౌక ICGS అరింజయను సమీపంలో పెట్రోలింగ్ చేయడానికి నియమించింది.
Also Read:Girls In Google: కొత్త పెళ్లికూతుళ్లు గూగుల్ లో ఏం సెర్చ్ చేస్తున్నారో తెలుసా!
సోమవారం తెల్లవారుజామున భారత సముద్ర జలాల్లో అనుమానాస్పదంగా కదులుతున్న పాకిస్థాన్ ఫిషింగ్ బోట్ ‘అల్ సోహెలీ’ని ఇండియన్ కోస్ట్ గార్డ్ గుర్తించింది. భారత తీర రక్షక దళం పాకిస్థాన్ బోట్‌లోని వ్యక్తులను ప్రశ్నించడం ప్రారంభించినప్పుడు బోటు తప్పించుకోవడం ప్రారంభించింది. భారత తీర రక్షక దళం హెచ్చరిక షాట్‌లు కాల్చినప్పటికీ ఆగలేదు. అయితే భారత కోస్ట్ గార్డ్ షిప్ ‘అరింజయ్’ పాకిస్థాన్ బోటును అడ్డుకుంది.
భారత కోస్ట్‌గార్డ్ బృందం పాకిస్థాన్ పడవలోకి వెళ్లగా సిబ్బంది అనుమానాస్పదంగా ప్రవర్తిస్తున్నట్లు గుర్తించారు. బోటులో ఐసీజీ సోదాలు నిర్వహించగా రూ.300 కోట్ల విలువైన ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, సుమారు 40 కిలోల మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. అధికారులు పడవను స్వాధీనం చేసుకుని, సిబ్బందిని అరెస్టు చేశారు. వారందరినీ తదుపరి విచారణ కోసం గుజరాత్‌లోని ఓఖా తీర పట్టణానికి తీసుకువచ్చారు.