Old Tax Regime : పాత పన్ను విధానం రద్దు పై స్పందించిన నిర్మలా సీతారామన్
పాత పన్ను విధానం రద్దు చేయాలన్న ప్రతిపాదన తమ వద్ద లేదన్నారు. పన్ను ఫైలింగ్ విధానం సరళంగా ఉండాలనే ఉద్దేశంతో కొత్త పన్ను విధానం తీసుకొచ్చినట్లు చెప్పారు.
- By Latha Suma Published Date - 05:31 PM, Tue - 4 February 25

Old Tax Regime : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాత పన్ను విధానం రద్దు పై స్పందించారు. ఈ మేరకు ఆమె పాత పన్ను విధానం రద్దు చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఓ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా నిర్మలా సీతారామన్ దీనిపై మాట్లాడారు. పన్ను చెల్లింపుదారులందరూ కొత్త పన్ను విధానంలోకి మారాలని మీరు భావిస్తున్నారా? అంటూ ఎదురైన ప్రశ్నకు నిర్మలా సీతారామన్ స్పందిస్తూ.. పాత పన్ను విధానం రద్దు చేయాలన్న ప్రతిపాదన తమ వద్ద లేదన్నారు. పన్ను ఫైలింగ్ విధానం సరళంగా ఉండాలనే ఉద్దేశంతో కొత్త పన్ను విధానం తీసుకొచ్చినట్లు చెప్పారు.
Read Also: Delhi Polls 2025 : ‘ఢిల్లీ’మే సవాల్.. రేపే ఓట్ల పండుగ.. త్రిముఖ పోరులో గెలిచేదెవరు ?
కొత్తగా తీసుకురాబోయే ఆదాయపు పన్ను చట్టం గురించి కూడా ఈ సందర్భంగా ప్రస్తావన వచ్చింది. 1961లో తీసుకొచ్చిన పాత ఆదాయపు పన్ను చట్టం స్థానంలో అనేక మార్పులు, చేర్పులతో కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని ప్రవేశపెట్టనున్నట్టు వెల్లడించారు. మరికొద్ది రోజుల్లో ప్రవేశపెట్టబోయే ఈ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందుతుందని భావిస్తున్నట్లు ఆమె తెలిపారు. దీని ద్వారా పన్నుల చెల్లింపుల్లో ఉన్న క్లిష్టతరమైన సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం నిర్ణయించిందన్నారు. ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్, టీడీఎస్, టీసీఎస్ వంటి సంక్లిష్టమైన ప్రక్రియలను మరింత సులభతరం చేస్తామని చెప్పారు.
కాగా, పాత పన్ను విధానంతో పోలిస్తే కొత్త పన్ను విధానాన్ని చాలా సరళంగా ఉండేలా చేసింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారుల్లో 70 శాతం మంది వరకు కొత్త పన్ను విధానానికి మారినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పుడు తాజాగా కొత్త పన్ను విధానంలో మరిన్ని పన్ను శ్లాబులు కేంద్రం తీసుకొచ్చింది. దీంతో పాత పన్ను విధానం ఇక చాలా మందికి పెద్దగా ప్రయోజనం లేకుండా పోతుందని నిపుణులు చెబుతున్నారు.