Delhi Polls 2025 : ‘ఢిల్లీ’మే సవాల్.. రేపే ఓట్ల పండుగ.. త్రిముఖ పోరులో గెలిచేదెవరు ?
2013 సంవత్సరం వరకు ఢిల్లీని దాదాపు 15 ఏళ్లు వరుసపెట్టి ఏలిన రాజకీయ చరిత్ర కాంగ్రెస్(Delhi Polls 2025)పార్టీకి ఉంది.
- By Pasha Published Date - 05:00 PM, Tue - 4 February 25

Delhi Polls 2025 : బుధవారం రోజు దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల పండుగ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీగా జరుగుతున్న ఈ త్రిముఖ పోరులో ఎవరు గెలుస్తారు ? అనేది తెలియాలంటే ఫిబ్రవరి 8వ తేదీ వరకు మనం ఎదురు చూడాల్సిందే. రేపు(బుధవారం) జరగనున్న పోలింగ్ వివరాలు, ఈసారి ఢిల్లీ ఎన్నికల్లోని కీలక ప్రచార అంశాల సమాచారంతో కథనమిది.
Also Read :Ratan Tatas Friend : రతన్ టాటా ఫ్రెండ్ శంతను నాయుడుకు కీలక పదవి.. ఎవరీ యువతేజం ?
కాంగ్రెస్
2013 సంవత్సరం వరకు ఢిల్లీని దాదాపు 15 ఏళ్లు వరుసపెట్టి ఏలిన రాజకీయ చరిత్ర కాంగ్రెస్(Delhi Polls 2025)పార్టీకి ఉంది. అలాంటి హస్తం పార్టీ గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. కనీసం ఒక్క అసెంబ్లీ సీటును కూడా గెల్వలేదు. దీంతో ఈసారి ఎన్నికల ప్రచారం సర్వశక్తులు ఒడ్డింది. హస్తం పార్టీ తరఫున రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ, రేవంత్ రెడ్డి వంటి ముఖ్య నేతలు ముమ్మర ప్రచారం చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ఢిల్లీ ప్రజలకు వివరించారు. ఆప్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కేజ్రీవాల్ తయారు చేయించిన శీష్ మహల్, యమునా నది నీటి నాణ్యత తగ్గిపోవడం, ఓటర్ల జాబితా ట్యాంపరింగ్, శాంతిభద్రతలు, మహిళా సంక్షేమం వంటి అంశాలను రాహుల్, ప్రియాంక లేవనెత్తారు. నెలకు రూ.8,500 నిరుద్యోగ భృతిని అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అయితే హస్తిన ప్రజలు ఏం చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
బీజేపీ
ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్నారు. ఢిల్లీని డెవలప్ చేయడం తమతోనే సాధ్యమన్నారు. ఆప్ సర్కారు చేసిన కుంభకోణాల గురించి ప్రజలకు వివరించారు. ఆప్ నేతలపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని వారు చెప్పారు. 25 ఏళ్ల క్రితం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. మళ్లీ ఇప్పుడు గెలవాలనే పట్టుదలతో మోడీ, అమిత్‌షా ఉన్నారు. ఈక్రమంలోనే మూడు రోజుల క్రితమే ఆప్ నుంచి దాదాపు 8 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ ఆప్ ఎమ్మెల్యేల సహకారంతో సదరు 8 నియోజకవర్గాల్లో గెలుస్తామనే ధీమాతో బీజేపీ ఉంది. గర్భిణులకు రూ.21,000 ఆర్థిక సహాయం, రూ.500కే వంట గ్యాస్ సిలిండర్లు అందిస్తామని కమల దళం ప్రకటించింది.
ఆప్
ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్పూ) సంక్షేమ ఎజెండానే నమ్ముకుంది. విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణాలు, ఆటో, టాక్సీ డ్రైవర్లకు బీమా, ఆలయ పూజారులు, గురుద్వారా గ్రంధీలకు రూ. 18,000 ఆర్థిక సహాయం అందిస్తామని ఆప్ అధినేత కేజ్రీవాల్ ప్రకటించారు. అయితే ఈ సారి ఆప్ ఎదుట చాలా సవాళ్లు ఉన్నాయి. అవినీతి ఆరోపణలు, స్కాంలు ఆప్‌పై నెగెటివ్ చరిష్మాను క్రియేట్ చేశాయి. చాలామంది ఆప్ అగ్రనేతలు బీజేపీలోకి జంప్ అయ్యారు. అకస్మాత్తుగా సీఎంను మార్చడంతో ఢిల్లీలో పాలన గాడితప్పి, ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరిగింది.
Also Read :Anasuya Bharadwaj : స్టార్ హీరో, మెగా డైరెక్టర్.. అలా అడిగితే నో చెప్పాను : అనసూయ
అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్ల వివరాలు
- ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాల్లో 699 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
- 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 13,766 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
- హోమ్ ఓటింగ్ సౌకర్యం ద్వారా 6,980 మంది ఇప్పటికే ఓట్లు వేశారు.
- సీనియర్ సిటిజన్లు, వికలాంగుల కోసం 733 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
- పోలింగ్ ప్రక్రియను క్రమబద్ధీకరించేందుకు క్యూ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (QMS) యాప్‌ను ఎన్నికల సంఘం ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఓటర్లు లైవ్‌లో పోలింగ్ బూత్‌ల వద్ద ఓటర్ల రద్దీపై సమాచారాన్ని చెక్ చేసుకోవచ్చు.
- పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత కోసం 220 కంపెనీల పారామిలిటరీ దళాలను, 35,626 మంది ఢిల్లీ పోలీసు సిబ్బందిని, 19,000 మంది హోమ్ గార్డులను మోహరించారు.
- 3,000 పోలింగ్ బూత్‌లను సున్నితమైనవిగా గుర్తించారు.