Operation Sindoor : ‘ఆపరేషన్ సిందూర్’ ట్రేడ్‌మార్క్, టైటిల్ కోసం పోటీ.. రేసులో ‘రిలయన్స్’
భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’(Operation Sindoor) పేరుతో సరిహద్దులో ప్రత్యేక ఆపరేషన్‌ను ప్రకటించిన కొన్ని గంటలకే.. ఈ పదంపై ట్రేడ్ మార్క్ కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ దరఖాస్తు చేసుకుంది.
- By Pasha Published Date - 02:29 PM, Thu - 8 May 25

Operation Sindoor : ‘ఆపరేషన్ సిందూర్’ అనే పదం ఇప్పుడు ఇంటర్నెట్‌లో అత్యధికంగా ట్రెండ్ అవుతోంది. ఆపరేషన్ సిందూర్‌ను మే 7న భారత ఆర్మీ విజయవంతంగా నిర్వహించింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీరు (పీఓకే)లో ఉన్న 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. భారత ఆర్మీకి విజయాన్ని సాధించిపెట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ అనే పదానికి భారతీయ కల్చర్, హిస్టరీతో గొప్ప అనుబంధం ఉంది. సిందూరాన్ని భారతీయులంతా పరమ పవిత్రమైందిగా భావిస్తారు. అందుకే ‘ఆపరేషన్ సిందూర్’ అనే పదానికి సంబంధించిన ట్రేడ్‌మార్క్‌ను దక్కించుకునేందుకు చాలామంది ప్రముఖులు అప్లై చేసుకుంటున్నారు. ఈ జాబితాలో ప్రధాని మోడీ సన్నిహితుడు, అపర కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఉంది.
Also Read :Who is Sajid Mir : సాజిద్ మీర్ ఎవరు ? పాకిస్తానే చంపింది.. బతికించింది !!
నలుగురు దరఖాస్తుదారులు ఎవరు ?
భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’(Operation Sindoor) పేరుతో సరిహద్దులో ప్రత్యేక ఆపరేషన్‌ను ప్రకటించిన కొన్ని గంటలకే.. ఈ పదంపై ట్రేడ్ మార్క్ కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ దరఖాస్తు చేసుకుంది. భారతీయుల ఎమోషన్‌తో సంబంధమున్న ఈ పదంపై ట్రేడ్‌మార్క్ కోసం రిలయన్స్ సహా మొత్తం నాలుగు సంస్థలు అప్లై చేశాయి. మే 7న తెల్లవారుజామున 1 గంట నుంచి 2 గంటల మధ్య ఆపరేషన్ సిందూర్ పూర్తయింది. అయితే అదే రోజు ఉదయం 10:42 గంటల నుంచి సాయంత్రం 6:27 గంటల మధ్య విద్య, వినోదం, మీడియా, సాంస్కృతిక సేవలను కవర్ చేసే నైస్ కేటగిరీలోని క్లాస్ 41 కింద నాలుగు ట్రేడ్‌మార్క్ దరఖాస్తులు దాఖలయ్యాయి. దరఖాస్తుదారులలో రిలయన్స్ ఇండస్ట్రీస్, ముంబై వాస్త్యవుడు ముఖేష్ చెత్రమ్ అగర్వాల్, రిటైర్డ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి గ్రూప్ కెప్టెన్ కమల్ సింగ్ ఒబెర్, ఢిల్లీకి చెందిన న్యాయవాది అలోక్ కొఠారి ఉన్నారు. ఆపరేషన్ సిందూర్ అనే పదాన్ని ఉపయోగించడానికి ప్రత్యేక అనుమతులు కోరుతూ ఈ దరఖాస్తుల్లో రిక్వెస్ట్ చేశారు. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో మీడియా లేదా వినోద పరమైన వెంచర్లను ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మదిలో కూడా అదే ఐడియా ఉందేమో అని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. “ఆపరేషన్ సిందూర్” యావత్ భారతదేశంలో ఇప్పుడు చాలా పాపులర్ అయింది. “సిందూర్” అనేది త్యాగం, శౌర్యం, భారతీయ సాంస్కృతిక భావానికి ప్రతీక.
‘ఆపరేషన్ సిందూర్’ టైటిల్ కోసం 15 సినిమా నిర్మాణ సంస్థల పోటీ
దాదాపు 15 సినిమా నిర్మాణ సంస్థలు ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) టైటిల్ కోసం పోటీ పడుతున్నాయని సమాచారం. ఈ టైటిల్ కోసం ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్‌లో నిర్మాతలు దరఖాస్తులు సమర్పించారు. దరఖాస్తులు సమర్పించిన సంస్థల జాబితాలో టీ సిరీస్, జీ స్టూడియోస్ కూడా ఉన్నాయి.
సైనిక ఆపరేషన్ల పేర్లపై ట్రేడ్‌మార్క్‌ను ఇస్తారా ?
భారతదేశంలో సైనిక ఆపరేషన్ల పేర్లు మేధో సంపత్తిగా పరిగణించబడవు. ఆ పేర్లపై ఎవరైనా ట్రేడ్ మార్క్‌ను పొందదలిస్తే భారత రక్షణ శాఖ అడ్డుకోదు. అభ్యంతరం చెప్పదు. ట్రేడ్ మార్క్స్ చట్టం- 1999 ప్రకారం ఎవరైనా ఏదైనా ట్రేడ్ మార్క్‌ను పొందితే దాన్ని దుర్వినియోగం చేయకూడదు. ఆయా ట్రేడ్ మార్క్‌లను మోసపూరితంగా , ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వాడకూడదు. ఒకవేళ ఎవరైనా చట్టబద్ధంగా సవాలు చేయకుంటే.. ఆపరేషన్ సిందూర్ వంటి పదాలపై ట్రేడ్ మార్క్‌ల మంజూరుకు పెద్దగా అడ్డంకులేవీ ఉండవు. భారతదేశంలో ట్రేడ్‌మార్క్ హక్కులు అనేవి.. తొలుత అప్లై చేసుకున్నవారికే కేటాయిస్తారు.