Ranjana Prakash Desai: 8వ వేతన సంఘం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్.. జస్టిస్ రంజనా దేశాయ్ సారథ్యంలో కమిషన్!
జస్టిస్ రంజనా దేశాయ్ నేతృత్వంలోని కమిషన్ సిఫార్సులు చేసే ముందు దేశ ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక వివేకం, అభివృద్ధి కోసం వనరుల లభ్యత వంటి అంశాలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటుంది.
- By Gopichand Published Date - 08:29 PM, Wed - 29 October 25
Ranjana Prakash Desai: కేంద్ర ప్రభుత్వం దేశంలోని 50 లక్షల మంది ఉద్యోగులు, దాదాపు 69 లక్షల మంది పింఛనుదారులకు సంతోషకరమైన వార్త అందించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో 8వ వేతన సంఘం (8th Pay Commission) ఏర్పాటుకు దాని నియమ నిబంధనలకు ఆమోదం లభించింది. ఈ నిర్ణయంతో కేంద్ర ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి. కేబినెట్ నిర్ణయాల గురించి కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడిస్తూ ఉద్యోగులు, పింఛనుదారులు కొత్త వేతన సంఘం కోసం సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్నారని, ఇప్పుడు ప్రభుత్వం వారికి శుభవార్త అందించిందని తెలిపారు.
జస్టిస్ రంజనా దేశాయ్ సారథ్యంలో కమిషన్
8వ వేతన సంఘం కూర్పును కూడా కేంద్రం ప్రకటించింది. ఈ కమిషన్ అధ్యక్షురాలిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ (Ranjana Prakash Desai)ని నియమించారు.
అధ్యక్షురాలు: జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ (సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి)
సభ్యులు: ప్రొఫెసర్ పులక్ ఘోష్ (ఐఐఎం బెంగళూరు- పార్ట్ టైమ్ సభ్యుడు), పంకజ్ జైన్ (పెట్రోలియం- సహజ వాయువు శాఖ కార్యదర్శి).
Also Read: KCR Health: కర్ర సాయంతో కేసీఆర్..కార్యకర్తల్లో ఆందోళన
బహుముఖ అనుభవం ఉన్న నాయకత్వం
జస్టిస్ రంజనా దేశాయ్ భారత న్యాయవ్యవస్థలో సుదీర్ఘ అనుభవం కలిగి ఉన్నారు. ఆమె ముంబై హైకోర్టు న్యాయమూర్తిగా ఆ తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. పదవీ విరమణ అనంతరం డీలిమిటేషన్ కమిషన్ ఛైర్‌పర్సన్‌గా, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (PCI)కి మొదటి మహిళా ఛైర్‌పర్సన్‌గా, ఉత్తరాఖండ్, గుజరాత్ రాష్ట్రాల యూనిఫామ్ సివిల్ కోడ్ (UCC) కమిటీలకు హెడ్‌గా ఆమె ముఖ్య సేవలు అందించారు.
నివేదిక, అమలు అంచనాలు
8వ వేతన సంఘం తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించడానికి 18 నెలల సమయం ఇచ్చారు. కమిషన్ సిఫార్సులను పరిశీలించిన తర్వాత అవి వచ్చే ఏడాది జనవరి 1, 2026 నుండి అమలులోకి వచ్చే అవకాశం ఉంది.
కమిషన్ పరిగణనలోకి తీసుకునే అంశాలు
జస్టిస్ రంజనా దేశాయ్ నేతృత్వంలోని కమిషన్ సిఫార్సులు చేసే ముందు దేశ ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక వివేకం, అభివృద్ధి కోసం వనరుల లభ్యత వంటి అంశాలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావాన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగుల వేతనాలను కూడా దృష్టిలో ఉంచుకొని నివేదికను రూపొందించనుంది. ఈ వేతన సంఘం సిఫార్సులు అమలైతే కేంద్ర ఉద్యోగుల జీతాలు, పెన్షనర్ల పింఛన్లు గణనీయంగా పెరగనున్నాయి.