Maoist : ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 12 మంది మావోయిస్టులు మృతి
మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న అబూజ్‌మడ్ ప్రాంతమంతా కాల్పుల మోతతో దద్దరిల్లుతున్నది.
- By Latha Suma Published Date - 01:31 PM, Thu - 12 December 24

Maoist : ఛత్తీస్ గఢ్ అబూజ్‌మడ్ అటవీ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున పోలీసులు, మావోయిస్టుల మధ్య భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసుల కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మరణించారు. దంతేవాడ, నారాయణపూర్ సరిహద్దుల్లోని దక్షిణ అబూజ్‌మడ్ అడవుల్లో భద్రతా సిబ్బంది మావోయిస్టుల కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులకు ఎదురుపడిన మావోయిస్టులు కాల్పులకు పాల్పడ్డారు. మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న అబూజ్‌మడ్ ప్రాంతమంతా కాల్పుల మోతతో దద్దరిల్లుతున్నది. రాత్రి నుంచే అబూజ్‌మడ్ ప్రాంతాన్ని భద్రతాబలగాలు చుట్టుముట్టాయి.
మావోయిస్టులకు పూర్తి పట్టుకున్న ఈ ప్రాంతంలో ఆపరేషన్ కదర్ పేరుతో ఛత్తీస్‌గఢ్ పోలీసులు 2026 కల్లా పూర్తిగా మావోయిస్టురహిత రాష్ట్రంగా చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గత నెల రోజులుగా అబూజ్‌మడ్ ప్రాంతం, దండకారణ్యం లో మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. గురువారం ఉదయం 3 గంటల నుంచి ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని బస్తర్ పోలీసులు వెల్లడించారు. కూంబింగ్‌లో నారాయణపూర్, దంతెవాడ, జగదల్‌పూర్, కొండగాల్ జిల్లా భద్రతా బలగాలతోపాటు డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్, సీఆర్‌పీఎఫ్ బలగాలు పాల్గొన్నాయి.
మరోవైపు బీజాపూర్ అటవీ ప్రాంతం గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధి ముంగా గ్రామంలో మంగళవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. మృతి చెందిన మావోయిస్టును పోలీసులు మొడియం అలియాస్ ఆకాష్ హేమ్లాగా గుర్తించారు. మావోయిస్టు పార్టీలోని నెంబర్ 2 కమాండర్ వెల్లా, మిలీషియా ప్లాటూన్ కమాండర్ కమ్లుతో పాటు దాదాపు 30నుంచి 40 మంది మావోయిస్టులు అటవీ ప్రాంతంలో సమావేశమైనట్లుగా సమాచారం అందడంతో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇక నవంబర్ 30న ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చెల్పాక-ఐలాపూర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే.
Read Also: IPL 2025: టైటిల్ పోరు ఆ రెండు జట్ల మధ్యేనా? మ్యాచ్ విన్నర్లతో నింపేసిన ఫ్రాంచైజీలు!