Chhattisgarh : దంతేవాడా జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ .. ఐదుగురు మావోలు మృతి
ఈ సంఘటన దంతేవాడా-బీజాపూర్ జిల్లాల సరిహద్దులో ఉన్న ఉస్పరిజాల అడవుల్లో చోటు చేసుకుంది. ఘటన అనంతరం పరిసర ప్రాంతాల్లో భద్రతా బలగాలు తనిఖీలు కొనసాగిస్తున్నాయి. మిగిలిన మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
- By Latha Suma Published Date - 12:40 PM, Tue - 25 March 25

Chhattisgarh : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతేవాడా జిల్లాలో మంగళవారం ఉదయం భద్రతా బలగాలు నక్సలైట్ల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులను హతమార్చారు. ఘర్షణ జరిగిన ప్రదేశంలో ఆహుతుల శవాలతో పాటు ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన దంతేవాడా-బీజాపూర్ జిల్లాల సరిహద్దులో ఉన్న ఉస్పరిజాల అడవుల్లో చోటు చేసుకుంది. ఘటన అనంతరం పరిసర ప్రాంతాల్లో భద్రతా బలగాలు తనిఖీలు కొనసాగిస్తున్నాయి. మిగిలిన మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. జిల్లాల నుంచి సంయుక్త బలగాలు ఉదయం నుంచి అడవుల్లో యాంటీ-నక్సల్స్ ఆపరేషన్‌ను ప్రారంభించాయి.
Read Also: Rare Temples : ఏడాదిలో ఒక్కరోజే తెరుచుకునే ఆలయాలు ఇవే
ఇటీవల బీజాపూర్, నారాయణపూర్ జిల్లాల్లో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్ల నేపథ్యంలో నక్సలైట్లపై ఒత్తిడి పెరగడంతో ఆదివారం 22 మంది మావోయిస్టులు ప్రభుత్వానికి లొంగిపోయారు. వీరిలో ఆరుగురిపై కలిపి రూ.11 లక్షల బహుమతి ప్రకటించబడి ఉంది. వీరంతా బీజాపూర్‌లో సీఆర్పీఎఫ్ డీఐజీ దేవేంద్ర సింగ్ నేగీ సమక్షంలో లొంగి పోయారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ.. “మావోయిస్టు భావజాలాన్ని విడిచిపెట్టి ప్రజాస్వామ్య పథంలోకి వచ్చిన వారికి మనస్పూర్తిగా స్వాగతిస్తున్నాం భద్రతా బలగాలు కొత్త శిబిరాలను ఏర్పాటు చేస్తున్నాయి. రహదారులు, ఆరోగ్య సేవలు తదితర మౌలిక సదుపాయాల్లో మెరుగుదలతో ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతోంది. దీనివల్ల స్థానికులు మావోయిస్టులను తిరస్కరించి ప్రభుత్వ పక్షాన నిలుస్తున్నారని తెలిపారు. ఇది ఇలా ఉండగా, మార్చి 20న బీజాపూర్-దంతేవాడా సరిహద్దు అటవీ ప్రాంతంలో మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో 18 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఎన్‌కౌంటర్‌లో బీజాపూర్ జిల్లా రిజర్వ్ గార్డు (DRG)కి చెందిన ఒక జవాన్ వీరమరణం పొందాడు.
అంతకుముందు కాంకేర్ జిల్లాలో జరిగిన మరొక ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. గడిచిన కొన్ని వారాల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌ల్లో భద్రతా బలగాలు మొత్తం 27 మంది మావోయిస్టులను హతమార్చినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈ విజయాల నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర మంత్రి కేదార్ కశ్యప్ మాట్లాడుతూ.. “భద్రతా బలగాలను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. వారు అత్యంత ధైర్యంగా మావోయిస్టులను ఎదుర్కొంటున్నారు. మావోయిస్టులు పూర్తిగా వెనక్కి వెళ్లిపోతున్నారు. 2026 నాటికి ఛత్తీస్‌గఢ్‌ను పూర్తిగా మావోయిస్టు నుంచి విముక్తి కల్పించడమే లక్ష్యం,” అని తెలిపారు. దేశ హోం మంత్రి అమిత్ షా, రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్, రాష్ట్ర హోం మంత్రి విజయ్ శర్మ కలిసి ఈ దిశగా కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. భద్రతా దళాల సేవలు గణనీయంగా పెరిగాయని, ప్రజల మద్దతుతో రాష్ట్రం త్వరలోనే నక్సలిజం నుంచి పూర్తిగా బయటపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.