Delhi CM Arvind Kejriwal: బీజేపీపై కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు.. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారంటూ విమర్శలు..!
తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కొనుగోళ్ల అంశంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు.
- Author : Gopichand
Date : 11-11-2022 - 12:47 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కొనుగోళ్ల అంశంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూసిన బీజేపీ రెడ్ హ్యాండెడ్ గా దొరికిందని ఆయన విమర్శలు కురిపించారు. అంతేకాకుండా ఢిల్లీలో తమ ఎమ్మెల్యేలను కూడా కొనగోలు చేసేందుకు భారీ కుట్ర చేస్తున్నారని ఆరోపణలు చేశారు. ఒక్కొక్క ఎమ్మెల్యేకి రూ. 25 కోట్లు ఆఫర్ చేస్తున్నారని చెప్పారు.
తెలంగాణలో జరిగిన ఘటనే ఇందుకు సాక్ష్యం అని ఆయన అన్నారు. ఫామ్ హౌజ్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో నిందితులు సంప్రదింపుల వీడియోను కేజ్రీవాల్ ప్రస్తావించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించి తెలంగాణ స్టింగ్ ఆపరేషన్ లో బీజేపీ దొరికిపోయిందని.విమర్శలు కురిపించారు. ఈ కేసులో నిందితులు ఢిల్లీలో 41 మంది ఎమ్మెల్యేలు తమ టచ్‌లో ఉన్నారని, ఒక్కొక్కరికి రూ.25 కోట్లు ఇస్తామని చెప్పినట్టు వీడియోలో స్పష్టంగా ఉందని ఆయన అన్నారు.
ముగ్గురు వ్యక్తులు తెలంగాణ ఎమ్మెల్యేలకు డబ్బులు ఎర చూపారని, ఎమ్మెల్యేలను అమిత్‌షాతో భేటీ చేయిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. 41 మంది ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకొంటున్నామని, ఢిల్లీలో త్వరలోనే ప్రభుత్వం పడిపోబోతున్నదని నిందితులు చెప్పారని కేజ్రీవాల్ పేర్కొన్నారు. తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుందనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏమున్నదని కేజ్రీవాల్ తెలిపారు.