Jharkhand Murders: చచ్చిపోతున్న మానవత్వం.. మరీ ఇంత దారుణ హత్యలా?
ఝార్ఖండ్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది
- By Anshu Published Date - 08:14 PM, Tue - 6 December 22
ప్రస్తుత కలియుగంలో మానవత్వం అనేది మనుషుల్లో మాయమైపోతోంది. ఇందుకు నిదర్శనంగా అనేక ఘటనలు జరుగుతున్నాయి. ఇటీవల జరుగుతున్న హత్యలు ఇందుకు ఊతమిస్తున్నాయి. మనిషి క్రూరత్వం ముందు మృగాలు కూడా సిగ్గుపడే పరిస్థితి దాపురిస్తోంది. అభివృద్ధి చెందుతున్న సైన్స్ ఓవైపు ఇతర గ్రహాల్లోకి వెళ్లి పరిశోధనలు జరిపేలా చేస్తుంటే మరోవైపు మనిషి తన కుంచిత మనస్తత్వంతో మరింత దిగజారిపోతున్నాడు.
ప్రస్తుత సమాజంలో భూమి కోసం, డబ్బు కోసం, ఆస్తి కోసం, అక్రమ బంధం కోసం, అన్నదమ్ములపై కోపంతో.. ఇలా రకరకాల చిన్న చిన్న కారణాలను సాకుగా చూపుతూ మరో మనిషిని నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు. మనిషి రాక్షసుడిలా మారిపోతున్నాడు. చదువు, విజ్ఞానాన్ని పక్కనబెట్టి ఉన్మాదిలా మారిపోతున్నాడు. బంధాలకు విలువ ఇవ్వకుండా దారుణాలకు తెగబడుతున్నాడు.
ఇటీవల వెలుగులోకి వచ్చిన శ్రద్ధా వాకర్ హత్యే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఆ ఘటనలో ప్రియురాలిని ముక్కలుగా నరికేశాడు నిందితుడు అఫ్తాబ్ పూనావాలా. ఈ ఘటనను మరువక ముందే ఇలాంటి క్రైమ్ ఇన్సిడెంట్లే మరో రెండు మూడు వార్తల్లో కనిపించాయి. అందులో ఒకటి కర్ణాటకలోని బెంగళూరు కేపీ అగ్రహార ప్రాంతంలో జరిగింది. ఓ 30 ఏళ్ల యువకుడు ఓ ప్రాంతంలో కూర్చొని ఉన్నాడు.
అర్ధరాత్రి వేళ ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులు అతడి వద్దకు వచ్చారు. ఈ క్రమంలో వారి మధ్య ఏదో వాగ్వాదం చోటు చేసుకుంది. గుంపులోని ఓ మహిళ రోడ్డు పక్కన ఉన్న పెద్ద రాయిని తీసుకొచ్చింది. కూర్చున్న వ్యక్తిని మిగతావారు అదిమి పట్టుకున్నారు. అందరూ కలిసి బండరాయితో మోదీ కర్కశంగా హతమార్చారు. ఇందంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. వివాదం ఏంటనేది ఇంత వరకు తేలలేదు. పోలీసులు కేసు నమోదు చేశారు.
రెండు పదుల వయసు దాటలేదు.. ఏమిటీ దారుణం?
ఇలాంటిదే మరో ఘటన ఝార్ఖండ్‌లో జరిగింది. కుంతి జిల్లాలో భూ వివాదంలో 20 ఏళ్ల యువకుడు తన కజిన్ తల నరికి దానితో సెల్ఫీలు కూడా తీసుకోవడం సంచలనం రేపింది. లేత వయసులో ఆ యువకుడిలో అంత కర్కశత్వం ఎలా వచ్చిందన్న ప్రశ్న ఇప్పుడు అంతు చిక్కని ప్రశ్నగా మారింది. ముర్హు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది.