Deepfake Videos : డీప్‌ఫేక్ వీడియోలకు కళ్లెం.. కొత్త చట్టం తెచ్చే యోచన
Deepfake Videos : ‘‘డీప్ ఫేక్ వీడియోలను కట్టడి చేయాల్సిన అవసరం ఉంది’’ అని ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోడీ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలను మొదలుపెట్టింది.
- Author : Pasha
Date : 22-11-2023 - 3:44 IST
Published By : Hashtagu Telugu Desk
Deepfake Videos : ‘‘డీప్ ఫేక్ వీడియోలను కట్టడి చేయాల్సిన అవసరం ఉంది’’ అని ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోడీ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలను మొదలుపెట్టింది. డీప్ ఫేక్ వీడియోలను కట్టడి చేసేందుకు కొత్త చట్టాన్ని తెచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు. దీనిపై చర్చించేందుకు నవంబరు 23,24 తేదీల్లో అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ప్రతినిధులతో సమావేశం అవుతామని తెలిపారు. ‘‘ఈ ఏడాది ఏప్రిల్‌లో ఐటీ నిబంధనలను రూపొందించాం. డీప్‌ఫేక్‌లు, నకిలీ సమాచారం ముప్పు లేకుండా నూతన ఫ్రేమ్‌వర్క్‌ను కూడా రెడీ చేస్తాం. అవసరమైతే కొత్త చట్టం కూడా తెస్తాం’’ అని కేంద్ర మంత్రి వెల్లడించారు.
We’re now on WhatsApp. Click to Join.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీని కొందరు దుర్వినియోగం చేస్తూ డీప్ ఫేక్ వీడియోలను క్రియేట్ చేస్తున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ ఇలాంటి వీడియోలను రూపొందిస్తూ వైరల్ చేస్తున్నారు. అయితే కొన్ని అంశాల ఆధారంగా ఇలాంటి ఫేక్ వీడియోలను గుర్తించవచ్చు. డీప్ ఫేక్ వీడియోల్లో ఉండే మనుషుల కదలికలు అసహజంగా ఉంటాయి. సహజంగా కనురెప్పలు ఆడకపోవడం, ముఖ కవళికల్లో మార్పులు లేకపోవడం వంటివి ఉంటాయి. సందర్భానికి అనుగుణంగా ముఖంలో ఎక్స్‌ప్రెషన్స్ లేకపోయినా అది ఫేక్ వీడియోగా(Deepfake Videos) మనం గుర్తించాలి.