Hypersonic Missile : భారత్ తొలి లాంగ్‌రేంజ్ హైపర్‌సోనిక్ మిస్సైల్ పరీక్ష సక్సెస్
హైపర్ సోనిక్ మిస్సైళ్లను(Hypersonic Missile) రెడీ చేసుకోవడం ద్వారా ఆ సామర్థ్యాన్ని కలిగిన అతికొద్ది దేశాల జాబితాలో భారత్ చేరిందని రాజ్‌నాథ్ తెలిపారు.
- Author : Pasha
Date : 17-11-2024 - 9:30 IST
Published By : Hashtagu Telugu Desk
Hypersonic Missile : సైనికపరంగా భారత్ మరో ఘనతను సొంతం చేసుకుంది. 1500 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలోని లక్ష్యాలను ఛేదించగల లాంగ్ రేంజ్ హైపర్‌సోనిక్ క్షిపణిని భారత్ తొలిసారి విజయవంతంగా పరీక్షించింది. శనివారం రాత్రి ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి ఈ మిస్సైల్‌ను విజయవంతంగా ప్రయోగించారు. ప్రయోగించిన వెంటనే ఈ మిస్సైల్‌కు ఎదురుగా ఉండే మార్గాల్లో ముందస్తుగా మోహరించిన వ్యవస్థల ద్వారా దాన్ని ట్రాక్ చేశారు. ఈ సమాచారాన్ని క్రోడీకరించిన విశ్లేషించిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) శాస్త్రవేత్తలు.. హైపర్ సోనిక్ మిస్సైల్ తన లక్ష్యాన్ని అధిక స్థాయి కచ్చితత్వంతో ఛేదించిందని గుర్తించారు. సీనియర్ డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలు, సాయుధ దళాల సభ్యుల సమక్షంలో ఈ మిస్సైల్ ప్రయోగం జరిగింది. ఈ క్షిపణిని డీఆర్‌డీఓ ప్రయోగశాలలు, పరిశ్రమ భాగస్వాముల సహకారంతో హైదరాబాద్‌లోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిస్సైల్ కాంప్లెక్స్‌లోని ప్రయోగశాలలు స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేశాయి.
Also Read :Netanyahus Residence : ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇంటిపై ఫ్లాష్ బాంబులు
ఈ ప్రయోగం విజయవంతమైన సందర్భంగా డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలు, రక్షణ శాఖ కార్యదర్శి, డీఆర్‌డీఓ ఛైర్మన్ బృందాన్ని భారత రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. ఈ ప్రయోగం విజయవంతం కావడాన్ని ఒక చారిత్రక క్షణంగా ఆయన అభివర్ణించారు. హైపర్ సోనిక్ మిస్సైళ్లను(Hypersonic Missile) రెడీ చేసుకోవడం ద్వారా ఆ సామర్థ్యాన్ని కలిగిన అతికొద్ది దేశాల జాబితాలో భారత్ చేరిందని రాజ్‌నాథ్ తెలిపారు. ఈ తరహా క్లిష్టమైన, సైనిక సాంకేతికతలను కలిగి ఉన్న దేశాలు ప్రపంచంలో కొన్నే ఉన్నాయని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. లాంగ్ రేంజ్ హైపర్‌సోనిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించడం ద్వారా భారతదేశం మరో కీలక మైలురాయిని సాధించినట్లయిందన్నారు. ఇది దేశ సైనిక సంసిద్ధతను సూచిస్తోందని పేర్కొన్నారు. ప్రస్తుతం లాంగ్ రేంజ్ హైపర్‌సోనిక్ మిస్సైళ్లు అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల వద్ద మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు భారత్ కూడా ఈ శక్తివంతమైన దేశాల జాబితాలో చేరింది.