India Vs Canada : కెనడియన్లకు వీసాలపై భారత్ కీలక నిర్ణయం
India Vs Canada : ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ ఈ ఏడాది జూన్ 18న కెనడాలో అనుమానాస్పద స్థితిలో హత్యకు గురయ్యాడు.
- Author : Pasha
Date : 22-11-2023 - 1:48 IST
Published By : Hashtagu Telugu Desk
India Vs Canada : ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ ఈ ఏడాది జూన్ 18న కెనడాలో అనుమానాస్పద స్థితిలో హత్యకు గురయ్యాడు. ఈ హత్య చేసింది భారత గూఢచార సంస్థ రా ఏజెంట్లే అని కెనడా ఆరోపించగా, భారత్ ఖండించింది. తమ దేశానికి ఆ హత్యతో సంబంధం లేదని తేల్చి చెప్పింది. ఈ ఒక్క ఘటనతో గత రెండు నెలలుగా కెనడా – భారత్ సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. వీసాల జారీ కూడా ఆగిపోయింది. భారత్ నుంచి చాలామంది కెనడాలో ఉన్నత విద్య, ఉద్యోగాలు, వ్యాపారాల కోసం వెళ్తుంటారు. వీసాల జారీకి బ్రేక్ పడటంతో వారంతా చాలా ఇబ్బందిపడ్డారు. కెనడా నుంచి కూడా భారత్‌కు ఎంతోమంది వచ్చి వెళ్తుంటారు. ఈనేపథ్యంలో పరిస్థితులను చక్కదిద్దే దిశగా భారత్ చొరవ చూపించింది. రెండు నెలల గ్యాప్ తర్వాత కెనడియన్లకు ఈ-వీసాల జారీని భారత్ తిరిగి ప్రారంభించింది. దీంతో రెండు దేశాల మధ్య ఏర్పడిన దౌత్యపరమైన ఉద్రికత్తలు చల్లబరిచే దిశగా అడుగులు పడ్డాయి.
We’re now on WhatsApp. Click to Join.
వాస్తవానికి దీనిపై గత నెలలోనే భారత్ నిర్ణయం తీసుకుంది. భారత్ తీసుకున్న నిర్ణయాన్ని కెనడా ప్రభుత్వం స్వాగతించింది. ఇది కెనడియన్లకు శుభవార్త అని వ్యాఖ్యానించింది. అమెరికా, బ్రిటన్ జోక్యం చేసుకొని కలిసి నడవాలని భారత్, కెనడాలకు సూచించిన తర్వాత పరిస్థితులు మళ్లీ గాడినపడ్డాయి. ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసు విచారణలో కెనడాకు సహకరించాలని భారత్‌కు అమెరికా, బ్రిటన్ సూచించడం సంచలనం క్రియేట్(India Vs Canada) చేసింది.