Bill Gates – Drainage : డ్రైనేజీలోకి దిగిన అపర కుబేరుడు బిల్‌గేట్స్.. ఎందుకు ?
Bill Gates - Drainage : అమెరికన్ బిలియనీర్ బిల్‌గేట్స్ సంపద గురించి మనందరికీ తెలుసు.
- Author : Pasha
Date : 22-11-2023 - 1:16 IST
Published By : Hashtagu Telugu Desk
Bill Gates – Drainage : అమెరికన్ బిలియనీర్ బిల్‌గేట్స్ సంపద గురించి మనందరికీ తెలుసు. ఆయనకున్న మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీల పేర్లు వినని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అలాంటి అపర కుబేరుడు నడుము వంచి అండర్ గ్రౌండ్ డ్రైనేజీలోకి దిగాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇన్‌స్టాగ్రామ్ సహా పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతోంది. ఎంతోమంది పనివాళ్లు, ఉద్యోగులు కలిగిన బిల్‌గేట్స్.. ఇంతకీ డ్రైనేజీలోకి ఎందుకు దిగాడు ? దానిలోకి దిగాల్సినంత అవసరం ఆయనకు ఏం వచ్చింది ? అనే ప్రశ్నలు మీ మదిలో తలెత్తుతున్నాయి కదా!!
We’re now on WhatsApp. Click to Join.
దీనికి సమాధానం ఏమిటంటే.. ప్రస్తుతం బిల్ గేట్స్ బెల్జియం పర్యటనలో ఉన్నారు. ఈసందర్భంగా ఆ దేశ రాజధాని బ్రసెల్స్‌లో ఉన్న మురుగునీటి మ్యూజియంను ఆయన సందర్శించారు. ఆ మ్యూజియం అండర్ గ్రౌండ్‌లో ఉంది. మీరు ఫొటోలో చూస్తున్నట్టుగా ఒక డ్రైనేజీ తలుపును తీసి.. లోపల ఉండే చిన్నపాటి మెట్ల ద్వారా నడుచుకుంటూ వెళ్తే అండర్ గ్రౌండ్‌లో ఉన్న మురుగునీటి మ్యూజియానికి చేరుకోవచ్చు. మ్యూజియంలోకి బిల్ గేట్స్ వెళ్లగానే ఆయనకు అక్కడున్న నిపుణులు ప్రజెంటేషన్ ఇచ్చారు. ‘‘18వ శతాబ్దంలో బ్రసెల్స్‌కు చెందిన మురుగు నీరంతా సిటీ సమీపంలోని సెనే నదిలోకి చేరడంతో.. అదే నీటిని తాగి ప్రజలు కలరా బారినపడ్డారు. దీనివల్ల ఆనాడు ఎంతోమంది చనిపోయారు’’ అని ఆనాడు సంభవించిన విపత్తు గురించి వివరించారు. మళ్లీ అలాంటి దుస్థితి తలెత్తకుండా ఈ మురుగునీటి మ్యూజియంలోనే బెల్జియం ప్రభుత్వం మురుగునీటిని శుద్ధి చేసే భారీ ప్లాంటును నిర్వహిస్తోందని తెలిపారు. బ్రసెల్స్ నగరంలోని మురుగునీరు దాదాపు 200 మైళ్ల దూరం నుంచి కాల్వల ద్వారా పారుతూ ఈ ప్లాంట్‌లోకి ఎలా చేరుతుంది? దాన్ని ఎలా ప్రాసెస్ చేస్తారు ? అనే వివరాలను ఈసందర్భంగా మ్యూజియం అధికారులు బిల్ గేట్స్‌కు(Bill Gates – Drainage) వివరించారు.