Pahalgam Attack: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు.. ఈ వస్తువుల ధరలు పెరిగే అవకాశం..
భారత్ - పాక్ దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. దీంతో భారతదేశంలోని పలు వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
- By News Desk Published Date - 09:56 PM, Fri - 25 April 25

Pahalgam Attack: జమ్మూకశ్మీర్ పహల్గాం ప్రాంతంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఉగ్రదాడిలో 25 మంది పర్యాటకులతోపాటు ఒక స్థానికుడు మృతి చెందాడు. ఉగ్రదాడి వెనుక పాక్ హస్తం ఉందని భారత్ భావిస్తుంది. ఇప్పటికే నిఘా వర్గాలు పాకిస్థాన్ నుంచే ఉగ్రదాడికి ప్లాన్ జరిగిందని గుర్తించాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ కు గట్టి గుణపాఠం చెప్పేందుకు భారత్ సిద్ధమైంది. ఇందులో భాగంగా సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. మరోవైపు భారత్ లో ఉన్న పాకిస్థానీలు వారంరోజుల్లో వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. పాకిస్థాన్ సైతం భారత్ ను రెచ్చగొట్టేలా కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. దీంతో ఇరు దేశాల మధ్య అంతంతమాత్రంగా ఉన్న సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ పరిణామాలు ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. దీంతో భారతదేశంలోని పలు వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పాకిస్థాన్ నుంచి భారత్ కు పెద్దమొత్తంలో డ్రైప్రూట్స్ దిగుమతి అవుతుంది. భారత మార్కెట్లో వీటి వినియోగం చాలా ఎక్కువ. అయితే, పాకిస్తాన్‌తో వాణిజ్య సంబంధాలు నిలిపివేయడం వల్ల భారతదేశంలో డ్రైఫ్రూట్స్ కొరత ఏర్పడి ధరలు భారీగా పెరగవచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు. డ్రైఫ్రూట్స్ తో పాటు సింధు ఉప్పుపైనా ప్రభావం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సింధు ఉప్పు లభించే దేశాల్లో పాకిస్తాన్ ఒకటి. అక్కడి నుంచి వచ్చే ఈ ఉప్పు భారతదేశంలోనూ వినియోగిస్తారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఈ ఉప్పు ధరలు రెట్టింపు అవ్వొచ్చునని భావిస్తున్నారు.
Also Read: Pahalgam Terror Attack : ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో సహా నిర్మూలించాలి – సీఎం రేవంత్
భారత్‌లో ఆప్టికల్ లెన్స్ పాకిస్తాన్ నుంచి దిగుమతి అవుతున్నాయి. భారత మార్కెట్లో వీటి డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్ల పాకిస్తాన్ నుంచి దిగుమతులు కీలకం. ప్రస్తుతం వాణిజ్య సంబంధాలు నిలిచిపోవడంతో ఆప్టికల్ లెన్స్ కూడా వినియోగదారులకు అందుబాటులో లేకుండా ధరలు భారీగా పెరగే అవకాశం ఉంది. వీటితోపాటు భారతదేశం పాకిస్తాన్ నుంచి సిమెంటు, పండ్లు, ముల్తానీ మట్టి, పత్తి, ఉక్కు, తోలు వస్తువులను దిగుమతి చేసుకుంటుంది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు కూడా కట్ కావడంతో ఈ వస్తువుల ధరలు మండిపోయే అవకాశం ఉంది.