India Pak Ceasefire : తటస్థ వేదికలో భారత్, పాక్ చర్చలు.. అమల్లోకి సీజ్ ఫైర్
ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచే కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది’’ అని విక్రమ్ మిస్రి(India Pak Ceasefire) చెప్పారు.
- By Pasha Published Date - 07:16 PM, Sat - 10 May 25

India Pak Ceasefire : యుద్ధం ఆగింది.. పూర్తిస్థాయి తక్షణ కాల్పుల విరమణకు భారత్, పాకిస్తాన్‌లు అంగీకరించాయి. ఈవిషయాన్ని మీడియా సమావేశంలో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రి వెల్లడించారు. ‘‘ఈరోజు(శనివారం) మధ్యాహ్నం 3.35 గంటలకు పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) నుంచి భారత డీజీఎంఓకు ఫోన్ కాల్ వచ్చింది. కాల్పుల విరమణ అంశంపై ఇద్దరూ చర్చించుకున్నారు. ఇరుపక్షాలు భూమి, గాలి, సముద్రంలో కాల్పుల విరమణ పాటించాలని నిర్ణయించుకున్నాయి. ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచే కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది’’ అని విక్రమ్ మిస్రి(India Pak Ceasefire) చెప్పారు. కాల్పుల విరమణకు సంబంధించి ఇరుదేశాలు నిర్దిష్ట నిబంధనలను నిర్దేశించుకున్నాయని పేర్కొన్నారు. భారత్, పాక్ డీజీఎంఓలు మళ్లీ మే 12న మధ్యాహ్నం 12 గంటలకు సంప్రదింపులు జరుపుతారని మిస్రి తెలిపారు.
తటస్థ వేదికలో చర్చలకు భారత్, పాక్ అంగీకారం : అమెరికా
భారత్, పాక్ మధ్య సయోధ్యను కుదిర్చేందుకు అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, తాను గత 48 గంటల్లో ఎంతోమంది భారత్, పాక్ అధికారులతో చర్చించామని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో వెల్లడించారు. తాము భారత ప్రధాని మోదీ, పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్, భారత విదేశాంగ మంత్రి జైశంకర్, పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, భారత ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, పాకిస్తాన్ ఎన్ఎస్ఏ ఆసిమ్ మాలిక్‌లతో మాట్లాడినట్లు తెలిపారు. తమ ప్రయత్నం ఫలించి కాల్పుల విరమణకు భారత్, పాక్ అంగీకరించాయన్నారు. ఇరుదేశాలు ఏదైనా ఒక తటస్థ వేదికలో చర్చలు జరిపేందుకు అంగీకారం తెలిపాయన్నారు.
Also Read :India Pak Ceasefire : తక్షణ కాల్పుల విరమణకు భారత్ – పాక్ ఓకే.. ట్రంప్ కీలక ప్రకటన
భారత విదేశాంగ మంత్రి ఏమన్నారంటే..
కాల్పుల విరమణ అంశంపై ఇవాళ భారత్, పాకిస్తాన్‌లు చర్చించి ఒక అవగాహనకు వచ్చాయని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ చెప్పారు. ఇరుదేశాలు కాల్పులు, సైనిక చర్యలను ఆపాలని నిర్ణయించాయన్నారు. భారత్ మొదటినుంచీ ఉగ్రవాదంపై పోరు సలుపుతోందని, ఇకపైనా అదే విధానాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.