PM Modi: ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు!
భారతదేశంలో తయారైన వస్తువులకే ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని మోదీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. "అది అలంకరణ వస్తువులు కావచ్చు లేదా బహుమతులు కావచ్చు. మనం మన దేశంలో తయారైన వస్తువులనే కొనుగోలు చేద్దాం" అని ఆయన కోరారు.
- By Gopichand Published Date - 09:57 PM, Mon - 25 August 25

PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అహ్మదాబాద్‌లోని ఖోడల్‌ధామ్ మైదానంలో రూ. 5,400 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఒక బహిరంగ సభలో ప్రసంగించిన మోదీ.. డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. “ఈ రోజు ప్రపంచంలో అన్ని దేశాలు తమ ఆర్థిక ప్రయోజనాల కోసమే చూస్తున్నాయి. ఆర్థిక స్వార్థ రాజకీయాలను మనం స్పష్టంగా చూస్తున్నాం” అని అన్నారు.
‘ఎంత ఒత్తిడి వచ్చినా మా బలాన్ని పెంచుకుంటాం’
దేశంలోని రైతులు, పశుపోషకుల ప్రయోజనాలే తనకు అత్యంత ముఖ్యమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. “నేను గాంధీ గడ్డ నుండి మాట్లాడుతున్నాను. నా దేశంలోని చిన్న వ్యాపారులు, రైతులు, పశుపోషకుల ప్రయోజనాలే మోదీకి అత్యంత ముఖ్యమైనవి. నా ప్రభుత్వం చిన్న వ్యాపారులకు, రైతులకు, పశుపోషకులకు ఎప్పటికీ అన్యాయం జరగనివ్వదు. ఎంత ఒత్తిడి వచ్చినా, దాన్ని తట్టుకునే బలాన్ని మేము పెంచుకుంటూ ఉంటాం” అని పేర్కొన్నారు.
విదేశీ వస్తువుల అమ్మకాలను మానుకోవాలని ప్రధాని విజ్ఞప్తి
భారతదేశంలో తయారైన వస్తువులకే ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని మోదీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. “అది అలంకరణ వస్తువులు కావచ్చు లేదా బహుమతులు కావచ్చు. మనం మన దేశంలో తయారైన వస్తువులనే కొనుగోలు చేద్దాం” అని ఆయన కోరారు. వ్యాపారవేత్తలు విదేశీ వస్తువులను విక్రయించడం మానుకోవాలని సూచించారు.
Also Read: India- Pakistan: ఆసియా కప్ 2025.. భారత్-పాకిస్తాన్ మధ్య మూడు మహాపోర్లు ఖాయమా?
జీఎస్టీ సంస్కరణలతో పండుగకు ‘డబుల్ బోనస్’
“మా ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణలు చేస్తోంది. దీపావళికి ముందు మీకు ఒక గొప్ప బహుమతి లభిస్తుంది. జీఎస్టీ సంస్కరణల వల్ల మన చిన్న పరిశ్రమలకు చాలా సహాయం లభిస్తుంది. అనేక వస్తువులపై పన్ను తగ్గుతుంది. ఈ దీపావళికి వ్యాపార వర్గానికి, మన కుటుంబంలోని మిగతా సభ్యులందరికీ సంతోషాల ‘డబుల్ బోనస్’ లభించనుంది” అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
ఆపరేషన్ సింధూర్‌ను ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ మాట్లాడుతూ.. పహల్గామ్ దాడికి భారత్ ఎలా ప్రతీకారం తీర్చుకుందో ప్రపంచం చూసింది. కేవలం 22 నిమిషాల్లోనే తుడిచిపెట్టేసింది. ఆపరేషన్ సింధూర్ మన సైన్యం శౌర్యానికి, సుదర్శన చక్రధారి మోహన్ భారత సంకల్పానికి ప్రతీకగా నిలిచిపోయింది. గతంలో ఉగ్రవాదులు మన రక్తం పారించేవారు. ఢిల్లీలో కూర్చున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేదు. కానీ ఈ రోజు ఉగ్రవాదులను, వారి నాయకులను ఎక్కడా దాక్కున్నా సరే మేము వదిలిపెట్టం” అని స్పష్టం చేశారు.