Abortion: మహిళకు అబార్షన్ చేయించుకునేందుకు ఢిల్లీ హైకోర్టు ఎందుకు అనుమతి ఇచ్చింది?
భారత చట్టంలో ఈ నిబంధన కొత్తది కాదు. 1970 లోనే ఈ నిబంధనను అమలులోకి తెచ్చారు. దీని ప్రకారం.. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 20 వారాల పిండాన్ని తొలగించడానికి అవకాశం ఉంది.
- By Gopichand Published Date - 11:43 AM, Fri - 19 September 25

Abortion: ఢిల్లీ హైకోర్టు ఇటీవల ఒక చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఇందులో భాగంగా 30 ఏళ్ల మహిళకు 22 వారాల గర్భాన్ని తొలగించుకోవడానికి అనుమతిని ఇచ్చింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో అన్ని సందర్భాల్లోనూ మహిళలకు ఇలాంటి అవకాశం లభించదు. అంతేకాకుండా భారత చట్టాల ప్రకారం.. 22 వారాల గర్భాన్ని తొలగించుకోవాలంటే (Abortion) కోర్టు అనుమతి అవసరం. అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి ప్రత్యేక కారణాలు లేకుండా మహిళకు గర్భస్రావానికి ఎందుకు అనుమతి ఇచ్చారో తెలుసుకుందాం.
ఈ తీర్పు ఏ కేసులో ఇచ్చారు?
ఢిల్లీ హైకోర్టులో ఒక 30 ఏళ్ల మహిళ కేసు విచారణలో ఉంది. ఆ మహిళ తన ప్రియుడితో లివ్-ఇన్-రిలేషన్‌షిప్‌లో ఉంది. ఆ సమయంలో ఆమె రెండుసార్లు గర్భవతి అయింది. మొదటిసారి ఆమె భాగస్వామి నమ్మించి గర్భనిరోధక మాత్రలతో అబార్షన్ చేయించారు. కానీ రెండోసారి ఆమె గర్భవతి అయినప్పుడు చాలా వారాల గర్భం. అబార్షన్ చేసుకోవడానికి ఆమె మొదట నిరాకరించినప్పటికీ ఆమె భాగస్వామి బలవంతంగా మెడికల్ అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి చేశారు.
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలు
భాగస్వామి మాట వినకపోవడంతో ఆమెపై దాడి చేసి వేధించారు. దీనిపై మహిళ ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించింది. దీనిపై ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి రవీంద్ర దుదేజా స్పష్టం చేశారు. గర్భాన్ని కొనసాగించడం బాధితురాలి బాధలను మరింత పెంచుతుందని ఆయన అన్నారు. నిజానికి ఆ మహిళకు పెళ్లి చేసుకుంటానని అబద్ధపు వాగ్దానం చేశారు. ఇప్పుడు అది సాధ్యం కానందున గర్భాన్ని కొనసాగించడం ఆమెకు కష్టంగా ఉండవచ్చని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.
Also Read: India vs Oman: నేడు భారత్- ఒమన్ మధ్య మ్యాచ్.. ఆ ఆటగాడికి ఆరు సిక్సర్లు కొట్టే సత్తా ఉందా??
ఈ తీర్పు ఏ నేపథ్యంలో ఇచ్చారు?
మహిళకు మరింత కష్టం కలగకుండా సామాజిక అపవాదు నుంచి ఆమెను కాపాడటానికి న్యాయమూర్తి ఈ తీర్పు ఇచ్చారు. బాధితురాలికి ఇప్పటికే నిందితుడైన స్నేహితుడి వల్ల చాలా సమస్యలు ఎదురయ్యాయి. కోర్టు కూడా ఆమె మానసిక స్థితిని అర్థం చేసుకోకపోతే ఆమెకు మరింత కష్టంగా ఉంటుందని న్యాయమూర్తి చెప్పారు. కోర్టు మహిళకు ఎయిమ్స్‌లో గర్భస్రావం చేయించుకోవడానికి అనుమతి ఇచ్చింది.
ఈ చట్టం ఏమిటి, మహిళలకు ఇలాంటి హక్కులు ఎప్పుడు లభిస్తాయి?
భారత చట్టంలో ఈ నిబంధన కొత్తది కాదు. 1970 లోనే ఈ నిబంధనను అమలులోకి తెచ్చారు. దీని ప్రకారం.. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 20 వారాల పిండాన్ని తొలగించడానికి అవకాశం ఉంది. దీన్ని MTP చట్టం- 1971 అని అంటారు. ఇందులో చట్టపరమైన అబార్షన్ ప్రక్రియ గురించి వివరిస్తారు. ఈ చట్టాన్ని 2021లో మార్చారు. దాని ప్రకారం 24 వారాల వరకు గర్భస్రావం చేసుకోవడానికి అనుమతి ఉంది. అయితే ఇది కూడా ప్రత్యేక పరిస్థితుల్లోనే సాధ్యం. చట్టం ప్రకారం.. వివాహిత, అవివాహిత మహిళల మధ్య ఇప్పుడు ఎలాంటి తేడా లేదు. ఇద్దరికీ సమాన హక్కులు ఉన్నాయి. అత్యాచారం బాధితులు, మైనర్లు, వికలాంగ మహిళలకు 24 వారాల వరకు గర్భస్రావం చేసుకునే హక్కు కల్పించారు.