Uttarakhand : కూలిన హెలికాప్టర్.. ఐదుగురు టూరిస్టులు మృతి
అధికారుల సమాచారం ప్రకారం, ఉదయం సుమారు 9 గంటల సమయంలో ఈ హెలికాప్టర్ గంగోత్రి దిశగా ప్రయాణిస్తుండగా, ఉత్తరకాశీ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో కూలిపోయింది. హెలికాప్టర్‌లో మొత్తం ఏడుగురు ఉన్నారు.
- Author : Latha Suma
Date : 08-05-2025 - 10:57 IST
Published By : Hashtagu Telugu Desk
Uttarakhand: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీలో గురువారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పర్యాటకులను తరలిస్తున్న ఓ ప్రైవేటు హెలికాప్టర్ గంగోత్రి వైపు ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన పర్యాటక వర్గాల్లో తీవ్ర ఆందోళనను కలిగించింది. అధికారుల సమాచారం ప్రకారం, ఉదయం సుమారు 9 గంటల సమయంలో ఈ హెలికాప్టర్ గంగోత్రి దిశగా ప్రయాణిస్తుండగా, ఉత్తరకాశీ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో కూలిపోయింది. హెలికాప్టర్‌లో మొత్తం ఏడుగురు ఉన్నారు. ఇందులో ఐదుగురు ఘటనా స్థలంలోనే మృతి చెందగా, మిగిలిన ఇద్దరు గాయాలపాలయ్యారు. తీవ్రంగా గాయపడిన వారిని తక్షణమే స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు.
Read Also: Mulugu : మావోయిస్టుల మందుపాతర పేలి.. ముగ్గురు పోలీసులు మృతి
ప్రమాద సమాచారం తెలియగానే స్థానికులు, పోలీసులు, మరియు సహాయక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. అడవిలో జరిగిందనే కారణంగా సహాయక చర్యలకు కొంత సవాళ్లు ఎదురైనా, బాధితులను త్వరగా వెలికితీసే ప్రయత్నాలు చేస్తున్నారు. హెలికాప్టర్ ప్రమాదానికి గల అసలు కారణాలు ఇంకా స్పష్టతనందలేదని అధికారులు తెలిపారు. వాతావరణ పరిస్థితుల వల్లనా, లేదా యాంత్రిక లోపమా అన్నదానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సాంకేతిక నిపుణులు సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ప్రభుత్వం ఈ ఘటనపై విచారణకు ఆదేశాలు జారీ చేసింది.
ఈ ప్రమాదంలో మృతి చెందినవారి వివరాలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. బాధితుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం సంతాపం తెలిపింది. అంతేకాక, బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం అందించే దిశగా చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి తెలిపారు. ఉత్తరాఖండ్‌లో పర్యాటక సీజన్ ప్రారంభమైన వేళ ఈ ప్రమాదం సంభవించడంతో పర్యాటకులలో భయాందోళనలు నెలకొన్నాయి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు తిరగలేదని నిర్ధారించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పర్యాటక సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.
Read Also: Rahul Gandhi : రాహుల్ గాంధీ ఎంపీ సభ్యత్వంపై పిటిషన్ కొట్టివేత