ఎల్పీజీపై గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం!
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు గృహేతర ఎల్పీజీ పంపిణీకి సంబంధించి ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
- Author : Gopichand
Date : 22-03-2026 - 11:04 IST
Published By : Hashtagu Telugu Desk
US-Iran War: పశ్చిమ ఆసియాలో యుద్ధం కారణంగా తలెత్తిన గ్లోబల్ ఎనర్జీ సంక్షోభం మధ్య ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. దేశంలో ఎల్పీజీ (LPG), చమురు నిల్వలు, యుద్ధ పరిస్థితుల వల్ల ఏర్పడిన సంక్షోభంపై వివిధ ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు వివరాలను వెల్లడించాయి.
‘పెట్రోల్-డీజిల్ తగినంత స్టాక్ ఉంది’
అన్ని రిఫైనరీలూ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని, ముడి చమురు తగినంత నిల్వ ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశంలో పెట్రోల్, డీజిల్ స్టాక్ కూడా సరిపడా ఉంది. రిఫైనరీల నుండి దేశీయ ఎల్పీజీ ఉత్పత్తిని గరిష్ట స్థాయికి చేర్చారు. పెట్రోల్, డీజిల్ సరఫరా క్రమబద్ధంగా జరుగుతున్నందున ప్రజలు భయాందోళనతో కొనుగోలు చేయవద్దని ప్రభుత్వం మరోసారి సూచించింది.
Also Read: Kerosene : ఏపీలో రేపటి నుంచి కిరోసిన్ పంపిణి
‘ఎల్పీజీ సరఫరా ఆందోళనకరం’
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఎల్పీజీ సరఫరా ఇంకా ఆందోళనకరంగానే ఉందని పేర్కొన్నారు. అయితే గృహ అవసరాలకు వాడే ఎల్పీజీ సిలిండర్ల డెలివరీ సాధారణంగానే జరుగుతోందని స్పష్టం చేశారు. కంగారులో బుక్ చేసే వారి సంఖ్య తగ్గింది. మెజారిటీ డెలివరీలు ‘డెలివరీ అథెంటికేషన్ కోడ్’ (DAC) ద్వారా జరుగుతున్నాయి. ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల వద్ద ఎలాంటి కొరత ఉన్నట్లు సమాచారం లేదు.
కమర్షియల్ గ్యాస్ సరఫరా పెంపు
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కమర్షియల్ ఎల్పీజీ కేటాయింపును ప్రభుత్వం 20 శాతం నుండి 50 శాతానికి పెంచింది. ఈ అదనపు 20 శాతం ఎల్పీజీని అవసరం ఎక్కువగా ఉన్న రంగాలకు ప్రాధాన్యత క్రమంలో అందిస్తారు. ఇందులో రెస్టారెంట్లు, ధాబాలు, హోటళ్లు, పారిశ్రామిక క్యాంటీన్లు, ఫుడ్ ప్రాసెసింగ్, డెయిరీ యూనిట్లు, ప్రభుత్వ రాయితీ క్యాంటీన్లు, కమ్యూనిటీ కిచెన్లు, వలస కూలీల కోసం కేటాయించిన 5 కిలోల సిలిండర్లు ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు గృహేతర ఎల్పీజీ పంపిణీకి సంబంధించి ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. మిగిలిన రాష్ట్రాల్లో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్లను అందుబాటులో ఉంచుతున్నాయి. గత వారంలో సుమారు 13,479 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ సిలిండర్లను సరఫరా చేశారు. విద్యా సంస్థలు, ఆసుపత్రులకు ప్రాధాన్యత ఇచ్చారు. మొత్తం కమర్షియల్ ఎల్పీజీలో దాదాపు 50 శాతం వాటా ఈ రంగాలకే అందుతోంది.