FASTag annual pass : అమల్లోకి ఫాస్టాగ్ వార్షిక పాస్.. ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే?
ఇది జాతీయ రహదారులపై ప్రయాణించే కార్లు, జీపులు, వ్యాన్‌ల వంటివాటి యజమానులకు వర్తించనుంది. వాణిజ్య వాహనాలకు ఇది వర్తించదు. ఈ కొత్త పాస్ ద్వారా వాహనదారులు ఏటా 200 ట్రిప్పులు లేదా ఒక సంవత్సరం వరకు (ఏది ముందైతే అది) టోల్‌చార్జీల వరించకుండా ప్రయాణించవచ్చు. ప్రయాణ పరిమితి పూర్తైన తర్వాత, మళ్లీ రూ.3 వేల చెల్లించి పాస్‌ను తిరిగి యాక్టివేట్ చేసుకోవచ్చు.
- By Latha Suma Published Date - 02:49 PM, Fri - 15 August 25

FASTag annual pass : జాతీయ రహదారులపై ప్రయాణించే వ్యక్తిగత వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం ఓ శుభవార్తను అందించింది. టోల్‌ప్లాజాల వద్ద పదే పదే ఫీజు చెల్లించాల్సిన అవసరాన్ని తగ్గిస్తూ, ఫాస్టాగ్ ఆధారిత వార్షిక టోల్‌పాస్‌ను తీసుకొచ్చింది. ఈ పాస్ ధర రూ.3,000గా నిర్ణయించారు. ఇది జాతీయ రహదారులపై ప్రయాణించే కార్లు, జీపులు, వ్యాన్‌ల వంటివాటి యజమానులకు వర్తించనుంది. వాణిజ్య వాహనాలకు ఇది వర్తించదు. ఈ కొత్త పాస్ ద్వారా వాహనదారులు ఏటా 200 ట్రిప్పులు లేదా ఒక సంవత్సరం వరకు (ఏది ముందైతే అది) టోల్‌చార్జీల వరించకుండా ప్రయాణించవచ్చు. ప్రయాణ పరిమితి పూర్తైన తర్వాత, మళ్లీ రూ.3 వేల చెల్లించి పాస్‌ను తిరిగి యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియను ఏడాదిలో ఎన్ని సార్లైనా కొనసాగించవచ్చు. ఇది పూర్తిగా వాహనదారుల సౌకర్యార్థమే తీసుకొచ్చిన నిర్ణయం.
ఈ పాస్‌ను యాక్టివేట్ చేసుకోవడానికి రవాణా శాఖ రూపొందించిన ‘రాజ్‌మార్గ్ యాత్ర’ యాప్ ద్వారా సులభమైన లింక్ అందుబాటులో ఉంది. అంతేగాక, భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) వెబ్‌సైట్, రోడ్డు రవాణా మరియు హైవే మంత్రిత్వశాఖ (MoRTH) వెబ్‌సైట్‌లలోనూ పాస్ యాక్టివేషన్‌కు అవసరమైన సమాచారం, లింక్ కనిపిస్తోంది. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పటికే ఫాస్టాగ్ ఉన్నవారు మళ్లీ కొత్తగా ట్యాగ్ కొనాల్సిన అవసరం లేదు. తమలో ఉన్న పాత ఫాస్టాగ్ ద్వారానే ఈ వార్షిక పాస్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. దీనివల్ల అదనపు ఖర్చు లేకుండా మరింత సౌలభ్యం కలుగుతుంది. టోల్ ప్రయాణాల లెక్కింపు ఎలా చేస్తారు? ఒక్కో టోల్‌ప్లాజా దాటడాన్ని ఒక ట్రిప్‌గా పరిగణిస్తారు. ఉదాహరణకు, హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే వాహనదారులు మార్గమధ్యలో నాలుగు టోల్‌గేట్లను దాటాలి. దీంతో ఒక్కసారి ప్రయాణానికి నాలుగు ట్రిప్పులు లెక్కపెడతారు. తిరిగి వస్తే మరో నాలుగు ట్రిప్పులు. అంటే మొత్తం 8 ట్రిప్పులు ఒక రౌండ్ ట్రిప్‌కి ఉపయోగమవుతాయి.
ఈ పాస్ తీసుకోవడం తప్పనిసరి కాదు. ఏడాది పొడవునా తక్కువ సార్లు ప్రయాణించే వారు లేదా ఒకేసారి రూ.3 వేలు చెల్లించాలనే ఇష్టం లేనివారు ప్రస్తుతం ఉన్న టోల్ విధానాన్ని కొనసాగించవచ్చు. ఫాస్టాగ్ ద్వారా టోల్‌గేట్ల వద్ద నేరుగా ఫీజు చెల్లిస్తూ ప్రయాణించవచ్చు. ఇప్పటి పరిస్థితులను గమనిస్తే, టోల్‌గేటు ఒక్కొక్కదానికి సగటున రూ.50 చెల్లించాల్సి వస్తోంది. అంటే 200 టోల్‌గేట్లు దాటితే దాదాపు రూ.10,000 ఖర్చవుతుంది. కానీ, ఇప్పుడు ప్రారంభించిన రూ.3,000 వార్షిక టోల్‌పాస్‌తో అదే ప్రయాణం కేవలం మూడో వంతు ఖర్చుతో పూర్తవుతుంది. అంటే వాహనదారులు ఏటా సగటున రూ.7,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ పాస్ ద్వారా ప్రయాణం సులభతరం కావడంతో పాటు డిజిటల్ వ్యవస్థల వినియోగం మరింత విస్తృతమవుతుంది. ఫాస్టాగ్ ఆధారిత టోల్‌పాస్ ద్వారా వాహనదారులకు వేగవంతమైన, నిరాఘాటమైన ప్రయాణం లభించనుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త విధానం రహదారి వనరుల వినియోగాన్ని మెరుగుపరచడంలో కూడా కీలకపాత్ర పోషించనుంది.