Farmer Protest: ఢిల్లీలో నేడు రైతుల మహా పంచాయత్.. హర్యానా-పంజాబ్ సరిహద్దు శంభు బార్డర్ వద్ద హైటెన్షన్
- Author : Vamsi Chowdary Korata
Date : 21-07-2026 - 11:50 IST
Published By : Hashtagu Telugu Desk
ఇప్పటికే విభిన్న నిరసనలతో అట్టుడుకుతున్న దేశ రాజధాని ఢిల్లీలో మరో భారీ ఆందోళనకు వేదిక సిద్ధమైంది. భారత్-అమెరికా (India-US) మధ్య ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందాన్ని (Trade Deal) తీవ్రంగా వ్యతిరేకిస్తూ ‘దేశ్ బచావో మోర్చా’ ఆధ్వర్యంలో నేడు “మహాపంచాయత్” పిలుపునిచ్చారు. ఈ భారీ ధర్నాలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా సుమారు 550కి పైగా రైతు సంఘాలు, పలు సామాజిక సంస్థలు ఏకమయ్యాయి. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి వేలాది మంది రైతులు ఢిల్లీలోని ‘కిసాన్ ఘాట్’ లక్ష్యంగా భారీగా తరలివస్తున్నారు. ఈ ట్రేడ్ డీల్ గనుక అమల్లోకి వస్తే విదేశీ ఉత్పత్తుల ప్రవాహం పెరిగి, దేశంలోని చిన్న తరహా రైతులు, స్థానిక వ్యాపారులు తీవ్రంగా నష్టపోతారని, వారి మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళనకారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
రైతులు భారీ సంఖ్యలో తరలివస్తున్న నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దులతో పాటు కిసాన్ ఘాట్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ వాణిజ్య ఒప్పందం వల్ల దేశీయ వ్యవసాయ రంగానికి కలిగే ముప్పును కేంద్ర ప్రభుత్వం గుర్తించి, వెంటనే డీల్‌ను విరమించుకోవాలని రైతు నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రైతుల రాకతో రాజధానిలో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించగా, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఢిల్లీ పోలీసులు, కేంద్రీయ బలగాలను భారీగా మోహరించారు. ప్రజాస్వామ్యబద్ధంగా తమ నిరసన తెలుపడానికి వచ్చిన తమను అడ్డుకుంటే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని రైతు సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు.