Extreme Poverty Rate: భారతదేశంలో అత్యంత పేదరికం నుంచి బయటపడిన 27 కోట్ల మంది ప్రజలు!
గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో పేదరికం తగ్గింది. గ్రామీణ పేదరికం 18.4 శాతం నుండి 2.8 శాతానికి తగ్గగా.. పట్టణ పేదరికం 11 సంవత్సరాల వ్యవధిలో 10.7 శాతం నుండి 1.1 శాతానికి తగ్గింది.
- By Gopichand Published Date - 09:28 PM, Sat - 7 June 25

Extreme Poverty Rate: భారతదేశం అత్యంత పేదరికాన్ని (Extreme Poverty Rate) తగ్గించడంలో గణనీయమైన పురోగతిని సాధించింది. 2011-12 నుండి 2022-23 వరకు 26.9 కోట్ల మంది అత్యంత పేదరికం నుండి బయటపడ్డారు. వరల్డ్ బ్యాంక్ తాజా డేటా ప్రకారం.. 2011-12లో అత్యంత పేదరిక రేటు 27.1 శాతం ఉండగా, 2022-23 నాటికి ఇది 5.3 శాతానికి తగ్గింది. 2011-12లో భారతదేశంలో సుమారు 34.45 కోట్ల మంది అత్యంత పేదరికంలో జీవించారు. 2022-23 నాటికి ఈ సంఖ్య వేగంగా తగ్గి 7.52 కోట్లకు చేరింది.
విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ఈ పురోగతి ప్రభుత్వ కార్యక్రమాలు, ఆర్థిక సంస్కరణలు, అవసరమైన సేవలకు మెరుగైన లభ్యత సమర్థతను హైలైట్ చేస్తుంది. ఈ పురోగతిలో ఎక్కువ భాగం ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల నుండి వచ్చింది. 2011-12లో భారతదేశం అత్యంత పేదరికంలో ఈ రాష్ట్రాల వాటా మొత్తం 65 శాతం ఉండగా, గత 10 సంవత్సరాలలో ఈ రాష్ట్రాలు మొత్తం పేదరిక తగ్గింపులో మూడింట రెండు వంతుల వాటాను అందించాయి.
Also Read: MLC Kavitha: ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది: ఎమ్మెల్సీ కవిత
వరల్డ్ బ్యాంక్ అత్యంత పేదరికాన్ని ఎలా నిర్వచిస్తుంది?
వరల్డ్ బ్యాంక్ 2021 ధరల ప్రకారం సర్దుబాటు చేసి రోజుకు 3 అమెరికన్ డాలర్ల కంటే తక్కువ ఆదాయంతో జీవనం సాగించే వారిని అత్యంత పేదవారిగా పరిగణిస్తుంది. 2017 ధరల ఆధారంగా గతంలో ఉపయోగించిన రోజుకు 2.15 డాలర్ల పేదరిక రేఖను పరిగణనలోకి తీసుకుంటే 2022-23లో భారతదేశంలో కేవలం 2.3 శాతం జనాభా మాత్రమే అత్యంత పేదరికంలో ఉంది. 2011లో ఈ గణాంకం 16.2 శాతం ఉండగా.. ఈ లెక్క ప్రకారం అత్యంత పేదరికంలో ఉన్నవారి సంఖ్య 20.59 కోట్ల నుండి 3.36 కోట్లకు తగ్గింది.
గ్రామీణ, పట్టణ పేదరికం
గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో పేదరికం తగ్గింది. గ్రామీణ పేదరికం 18.4 శాతం నుండి 2.8 శాతానికి తగ్గగా.. పట్టణ పేదరికం 11 సంవత్సరాల వ్యవధిలో 10.7 శాతం నుండి 1.1 శాతానికి తగ్గింది. భారతదేశం బహుమితీయ పేదరికం (మల్టీడైమెన్షనల్ పావర్టీ)ను తగ్గించడంలో కూడా గట్టి మెరుగుదలను చూసింది. ఇందులో ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాల వంటి అంశాలు ఉన్నాయి. బహుమితీయ పేదరిక సూచిక 2005-06లో 53.8 శాతం ఉండగా.. 2019-21లో ఇది 16.4 శాతానికి, 2022-23లో మరింత తగ్గి 15.5 శాతానికి చేరింది.