Corruption Case: మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ అరెస్ట్..!
- Author : HashtagU Desk
Date : 06-04-2022 - 3:05 IST
Published By : Hashtagu Telugu Desk
మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ను అవినీతి కేసులో భాగంగా సీబీఐ బుధవారం అరెస్ట్ చేసింది. అవినీతి కేసులో దేశ్‌ముఖ్‌ను కష్టడీలోకి తీసుకునేందుకు ముంబై కోర్టు గతవారం సీబీఐకు అనుమతి ఇచ్చిన విషయం తెల్సిందే. అంతకు ముందు దేశ్‌ముఖ్ వ్యక్తిగత కార్యదర్శి కుందన్ షిండే, కార్యదర్శి సంజీవ్ పల్నాడెను కస్టడీలోకి తీసుకున్నారు.
పోలీస్ ఇన్‌స్పెక్టర్ సచిన్ వజేను డిస్మిస్ చేశారు. ఇక బాంబే హైకోర్టు అనిల్ దేశ్‌ముఖ్ పిటిషన్‌ను స్వీకరించేందుకు తిరస్కరించింది. అవినీతి కేసులో తన కస్టడీని కోరుతూ సీబీఐ దరఖాస్తును సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం అనుమతించడాన్ని దేశ్‌ముఖ్ సవాలు చేశారు. సీబీఐ కేసులో ఇద్దరు నిందితుల ముందస్తు బెయిల్ పిటిషన్లను కూడా బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. అనిల్ దేశ్‌ముఖ్ ఉద్దేశపూర్వకంగానే కస్టడీని తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని సీబీఐ ఆరోపించింది.
ఇకపోతే ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరం వీర్ సింగ్ అప్పటి హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నగరంలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు రూ 100 కోట్లు వసూలు చేయాలని పోలీస్ అధికారులకు దేశ్‌ముఖ్ టార్గెట్ విధించారని ఆయన ఆరోపించారు. ఈ ఆరోపణల నేపధ్యంలో దేశ్‌ముఖ్‌పై కేసు నమోదు చేయాలని గతంలోనే బాంబే హైకోర్టు సీబీఐని ఆదేశించింది. దీంతో తనపై ఆరోపణలు రావడంతో గత ఏడాది ఏప్రిల్‌లో దేశ్‌ముఖ్ మంత్రి పదవికి రాజీనామా చేశారు.