ఎక్స్ కీలక నిర్ణయం.. భారత ప్రభుత్వ ఆదేశాలతో అభ్యంతరకర కంటెంట్‌పై వేటు!
గ్రోక్ (Grok) అనేది ఎలన్ మస్క్‌కు చెందిన xAI కంపెనీ అభివృద్ధి చేసిన ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్‌బాట్. దీనిని ఎక్స్ ప్లాట్‌ఫారమ్‌తో పాటు ప్రత్యేక యాప్ ద్వారా కూడా వినియోగించవచ్చు.
- Author : Gopichand
Date : 11-01-2026 - 2:30 IST
Published By : Hashtagu Telugu Desk
Grok AI: సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ యజమాని, ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ కంటెంట్‌కు సంబంధించి తన తప్పును అంగీకరించారు. భారత ప్రభుత్వ చట్టాలకు లోబడి పనిచేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఎక్స్ ప్లాట్‌ఫారమ్‌లో ఉన్న అభ్యంతరకర కంటెంట్‌పై మోదీ ప్రభుత్వం సీరియస్ కావడంతో ఎక్స్ యాజమాన్యం తక్షణమే స్పందించి అటువంటి ఖాతాలపై చర్యలు తీసుకుంది.
ANI నివేదిక ప్రకారం ఎక్స్ సుమారు 600 ఖాతాలను తొలగించింది. దాదాపు 3,500 పోస్ట్‌లను బ్లాక్ చేసింది. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగానే పనిచేస్తామని, ఇకపై అభ్యంతరకర కంటెంట్‌ను అనుమతించబోమని ఎక్స్ స్పష్టం చేసింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ అభ్యంతరకర కంటెంట్‌ను గుర్తించి నోటీసులు పంపిన వారం రోజుల్లోనే ఈ చర్యలు చేపట్టారు.
Also Read: అంతర్జాతీయ ఉద్రిక్తతలు నేపథ్యంలో భారత రక్షణ బడ్జెట్ పెరుగుతుందా?
Grok AI వివాదం ఏమిటి?
గత కొన్ని రోజులుగా ఎక్స్ ప్లాట్‌ఫారమ్‌లో చలామణి అవుతున్న అశ్లీల కంటెంట్‌పై పెద్ద ఎత్తున వివాదం నడుస్తోంది. చాలా మంది యూజర్లు Grok AI సహాయంతో అసభ్యకరమైన కంటెంట్‌ను రూపొందిస్తున్నారని విమర్శలు వచ్చాయి.
Grok AI అంటే ఏమిటి?
గ్రోక్ (Grok) అనేది ఎలన్ మస్క్‌కు చెందిన xAI కంపెనీ అభివృద్ధి చేసిన ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్‌బాట్. దీనిని ఎక్స్ ప్లాట్‌ఫారమ్‌తో పాటు ప్రత్యేక యాప్ ద్వారా కూడా వినియోగించవచ్చు. ఇటీవల గ్రోక్ ద్వారా సృష్టించబడుతున్న అశ్లీల చిత్రాలు, దాని ఎడిటింగ్ ఫీచర్ తీవ్ర చర్చకు దారితీశాయి. కొందరు వ్యక్తులు ఈ AIని దుర్వినియోగం చేస్తూ మహిళలు, మైనర్ల ఫోటోలను అశ్లీల కంటెంట్‌గా మారుస్తున్నారు. దీనిని మోదీ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి ఎక్స్‌కు కఠిన ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం హెచ్చరించిన తర్వాతే ఎలన్ మస్క్ ఈ దిశగా చర్యలు చేపట్టారు.