National Herald Case : సోనియా, రాహుల్‌లపై ఈడీ ఛార్జ్‌షీట్.. నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం
అక్రమ చలామణి నిరోధక చట్టంలోని సెక్షన్ (8) నిబంధన 5(1) ప్రకారమే తాము జప్తు చేసిన ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నామని ఈడీ(National Herald Case) తెలిపింది.
- By Pasha Published Date - 07:01 PM, Tue - 15 April 25

National Herald Case : ‘నేషనల్ హెరాల్డ్’ పత్రిక కాంగ్రెస్ పార్టీకి చెందినది. ఈ పత్రికకు సంబంధించిన కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దూకుడుగా ముందుకు సాగుతోంది. ఈ కేసులో మనీలాండరింగ్ అభియోగాలను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సహా పలువురిపై ఈడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఇందులో నిందితులుగా కాంగ్రెస్ నేతలు సామ్ పిట్రోడా, సుమన్ దూబేల పేర్లను కూడా ఈడీ చేర్చింది. ఏప్రిల్ 9న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులోని ప్రత్యేక జడ్జి విశాల్ గోగ్నేకు ఛార్జ్‌షీట్‌ను సమర్పించింది. దీన్ని పరిశీలించిన ప్రత్యేక జడ్జి.. తదుపరి విచారణను ఏప్రిల్ 25వ తేదీకి వాయిదా వేశారు. ఆ రోజున ఈ కేసుతో ముడిపడిన డైరీలను కూడా తమకు సమర్పించాలని ఆదేశించారు.
Also Read :Cool News 2025 : ఐఎండీ కూల్ న్యూస్.. ఈసారి దంచికొట్టనున్న వానలు
రూ.700 కోట్ల ఆస్తుల జప్తునకు నోటీసులు
ఈ కేసులో 2023 నవంబరులో జప్తు చేసిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు చెందిన రూ.700 కోట్లకుపైగా విలువ చేసే ఆస్తుల స్వాధీనానికి గత శుక్రవారం(ఏప్రిల్ 11న) ఈడీ నోటీసులు జారీ చేసింది. ఆయా ఆస్తుల్లో ఉన్న వారు ఖాళీ చేయాలని పేర్కొంది. అద్దెకు ఉంటున్న వారు ఇక నుంచి తమకు ఆ మొత్తాన్ని చెల్లించాలని వెల్లడించింది. అక్రమ చలామణి నిరోధక చట్టంలోని సెక్షన్ (8) నిబంధన 5(1) ప్రకారమే తాము జప్తు చేసిన ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నామని ఈడీ(National Herald Case) తెలిపింది. ఆస్తులున్న ప్రాంతాల్లో (దిల్లీ, ముంబై, లఖ్‌నవూ) భవనాలకు నోటీసులను అంటించామని పేర్కొంది. ముంబైలోని బాంద్రాలో ఏజేఎల్‌కు ఉన్న భవనంలో అద్దెకు ఉంటున్న జిందాల్ సౌత్ వెస్ట్ ప్రాజెక్టు సంస్థకు కూడా నోటీసులు పంపామని, ఇక నుంచి ఆ సంస్థ కూడా అద్దె/లీజు మొత్తం తమకు చెల్లించాలని ఈడీ స్పష్టం చేసింది.
రాహుల్, సోనియాలపై అభియోగాలు ఏమిటి ?
నేషనల్ హెరాల్డ్ పత్రికను గతంలో ప్రచురించిన ఏజేఎల్ సంస్థ ఆస్తుల విలువ దాదాపు రూ.2 వేల కోట్లు ఉంటుందని ఈడీ అంటోంది. అయితే యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ద్వారా సోనియా, రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలు రూ.50 లక్షలకే ఏజేఎల్ సంస్థను సొంతం చేసుకున్నారన్న ఆరోపణలపై ఈడీ విచారణ జరుపుతోంది. యంగ్ ఇండియా సంస్థలో సోనియా, రాహుల్‌లకు చెరో 38 శాతం వాటాలు ఉన్నాయి.
సీపీసీ ఛైర్‌పర్సన్‌గా సోనియా, విపక్ష నేతగా రాహుల్..
మాజీ ప్రధానమంత్రి దివంగత రాజీవ్ గాంధీ సతీమణి సోనియాగాంధీ ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. రాజస్థాన్ రాష్ట్రం నుంచి ఆమె రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్లమెంటరీ కమిటీ (సీపీసీ) ఛైర్‌పర్సన్‌గానూ సోనియా సేవలు అందిస్తున్నారు. ఇక రాహుల్ గాంధీ లోక్‌సభలో విపక్ష నేతగా వ్యవహరిస్తున్నారు.