Maharashtra : నెక్ట్స్ సీఎం దేవంద్ర ఫడ్నవీస్ కావొచ్చు: సంజయ్ రౌత్
సీఎం పదవే ప్రధాన అంశంగా ఉండటంతో కూటమి నేతలతో చర్చోపచర్చలు జరుగుతున్నాయని అంటున్నారు.
- By Latha Suma Published Date - 03:39 PM, Tue - 26 November 24

Sanjay Raut : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఏక్‌నాథ్ శిండే తన సీఎం పదవికి ఈరోజు రాజీనామా చేయడంతో ఆ రాష్ట్రానికి తదుపరి సీఎం ఎవరనే చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ శిండే తన పదవికి రాజీనామా చేశారని.. తదుపరి సీఎం దేవంద్ర ఫడ్నవీస్ కావొచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
అయితే తమ పార్టీల కోసం ఏక్‌నాథ్ శిండే, అజిత్ పవార్‌లు సొంతంగా నిర్ణయాలు తీసుకోలేరన్నారు. ఈ రెండు పార్టీలు ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి కనుసన్నల్లోనే నడుస్తున్నాయని.. ప్రస్తుతం బీజేపీ మెజారిటీ సాధించింది కాబట్టి వారికి అవకావం ఉండకపోవచ్చన్నారు. ఇకపోతే..ఫలితాలు వెలువడి నాలుగు రోజులైనా కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై ప్రతిష్ఠంభన తొలగలేదు. దీనిపై ‘మహాయుతి’ నేతలతో ఢిల్లీలో ముమ్మర కసరత్తు జరుగుతోంది. అధికారికంగా సీఎం ఎవరనేది ప్రకటించనప్పటికీ మరో నాలుగైదు రోజుల్లో ముఖ్యమంత్రితో సహా కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేయనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. డిసెంబర్ 2వ తేదీన అతిపెద్ద ఈవెంట్‌గా ఈ ప్రమాణోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు చెబుతున్నారు. సీఎం పదవే ప్రధాన అంశంగా ఉండటంతో కూటమి నేతలతో చర్చోపచర్చలు జరుగుతున్నాయని అంటున్నారు.
మరోవైపు దేవేంద్ర ఫడ్నవిస్‌కు తిరిగి సీఎం పదవి కట్టబెట్టాలని బీజేపీ ఎమ్మెల్సీ ప్రవీణ్ దరేకర్ సహా పలువురు బీజేపీ నేతలు అంటున్నారు. బీజేపీ మునుపెన్నడూ లేనంతగా 132 సీట్లు గెలుచుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని లీడ్ చేసే బాధ్యత ఫడ్నవిస్‌కు అప్పగించడం ఉత్తమ ఎంపిక అవుతుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇక మహాయుతి కూటమిలో మరో కీలక భాగస్వామిగా ఉన్న అజిత్ పవార్ ఎన్‌సీపీ వర్గం ఫడ్నవిస్ ముఖ్యమంత్రి అయితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రకటించింది.
Read Also: Pushpa 2 Runtime : పుష్ప 2 రన్ టైం ..ఎంతో తెలుసా..?