Vanshika Saini : కెనడాలో ఆప్ నేత కుమార్తె దారుణ హత్య
ప్రతిరోజూ ఉదయాన్నే కుటుంబసభ్యులతో ఫోన్‌లో మాట్లాడే వంశిక(Vanshika Saini).. ఏప్రిల్ 26న కుటుంబసభ్యులకు ఫోన్ కాల్ చేయలేదు.
- By Pasha Published Date - 11:33 AM, Tue - 29 April 25
Vanshika Saini : పంజాబ్‌కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత దేవీందర్ సింగ్ సైనీ కుమార్తె 21 ఏళ్ల వంశికా సైనీ దారుణ హత్యకు గురైంది. నాలుగు రోజుల క్రితం కనిపించకుండా పోయిన వంశికా సైనీ .. కెనడాలోని ఒట్టావా నగర బీచ్‌లో విగతజీవిగా కనిపించింది. గత రెండున్నర ఏళ్లుగా కెనడాలో చదువుతున్న వంశిక హత్యకు గురైందని తెలియడంతో ఆమె తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. ఆప్ ఎమ్మెల్యే కుల్జిత్ సింగ్ రంధావా అనుచరుడే దేవీందర్ సింగ్ సైనీ.
Also Read :Information Commissioners: సీఐసీగా చంద్రశేఖర్ రెడ్డి.. ఇన్ఫర్మేషన్ కమిషనర్లుగా ఏడుగురు
ఏప్రిల్ 22న కాల్ చేయకపోవడంతో..
ప్రతిరోజూ ఉదయాన్నే కుటుంబసభ్యులతో ఫోన్‌లో మాట్లాడే వంశిక(Vanshika Saini).. ఏప్రిల్ 22న కుటుంబసభ్యులకు ఫోన్ కాల్ చేయలేదు. దీంతో వారు ఆందోళనకు గురయ్యారు. వంశికకు కాల్ చేయగా ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. కెనడాలో ఉన్న వంశిక సన్నిహితులు స్థానిక పోలీసులకు కంప్లయింట్ ఇచ్చారు. పోలీసులు దర్యాప్తు చేయగా ఒట్టావా బీచ్‌లో ఆమె మృతదేహం లభ్యమైంది. ఆమెను ఎవరు హత్య చేశారు ? ఎందుకు హత్య చేశారు ? అనేది తెలియాల్సి ఉంది. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. తమ కుమార్తె మరణంపై అనుమానాలు ఉన్నాయని, సమగ్రంగా దర్యాప్తు చేయాలని కెనడా పోలీసులను వంశిక తల్లిదండ్రులు కోరారు.
Also Read :Parshuram Jayanti : గురువు శివుడు.. శిష్యుడు ద్రోణాచార్యుడు.. పరశురామ ది గ్రేట్
ఏప్రిల్ 22 నుంచి మిస్సింగ్..
వంశికా సైనీ పంజాబ్‌లోని డేరా బస్సీ వాస్తవ్యురాలు. ఇంటర్ సెకండియర్ పూర్తి కాగానే ఉన్నత విద్య కోసం వంశిక కెనడాకు వెళ్లింది. అక్కడ ఒక డిప్లొమా కోర్సులో ఆమె చేరింది. ఏప్రిల్ 18వ తేదీనే వంశిక వార్షిక పరీక్షలు కూడా పూర్తయ్యాయి. తదుపరిగా ఆమె ఒక కంపెనీలో పార్ట్ టైం జాబ్ చేయడం మొదలుపెట్టింది. ఏప్రిల్ 22న కంపెనీకి బయలుదేరిన వంశిక.. ఇక తన రూంకు తిరిగి రాలేదు. ఏప్రిల్ 25న తాను IELTS పరీక్ష రాయాల్సి ఉందని స్నేహితులతో వంశిక చెప్పినట్లు సమాచారం. ఆమె పరీక్ష ఎలా రాసిందో తెలుసుకునేందుకు స్నేహితులు ఆరా తీయగా.. ఏప్రిల్ 22 నుంచి వంశిక కనిపించడం లేదని తన రూం మేట్లు చెప్పారు. దీనిపై వారు వెంటనే వంశిక తల్లిదండ్రులకు సమాచారాన్ని అందించారు. స్థానిక పోలీసులకు కూడా ఫిర్యాదు ఇచ్చారు. కాగా, వంశిక మృతిపై కెనడాలోని భారతీయ రాయబార కార్యాలయం దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది.