Leader of Opposition : లోక్‌సభలో విపక్ష నేతగా రాహుల్‌గాంధీ.. సీడబ్ల్యూసీ తీర్మానం
ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో కీలక తీర్మానం చేశారు.
- Author : Pasha
Date : 08-06-2024 - 3:46 IST
Published By : Hashtagu Telugu Desk
Leader of Opposition : ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో కీలక తీర్మానం చేశారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ బాధ్యతలను చేపట్టాలని సీడబ్ల్యూసీ తీర్మానం చేసింది. ఈవిషయాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ మీడియాకు వెల్లడించారు. లోక్‌సభలో విపక్షాల గొంతుకను బలంగా వినిపించే స్థాయి కలిగిన గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ అని ఆయన చెప్పారు. అయితే ఈ ప్రతిపాదనను రాహుల్‌గాంధీ అంగీకరిస్తారా ? అని మీడియా ప్రతినిధులు కేసీ వేణుగోపాల్‌ను ప్రశ్నించగా.. ‘‘త్వరలోనే రాహుల్ గాంధీ దీనిపై నిర్ణయం తీసుకుంటారు’’ అని చెప్పారు. రాహుల్ గాంధీ బలమైన నాయకత్వ పటిమ, భారత్ జోడో యాత్ర వల్లే దేశంలో కాంగ్రెస్ పునరుజ్జీవనం ప్రారంభమైందని వేణుగోపాల్ అన్నారు.
We’re now on WhatsApp. Click to Join
సీడబ్ల్యూసీ సమావేశం అనంతరం తర్వాత కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ప్రమోద్ తివారీ మాట్లాడుతూ.. ‘‘కచ్చితంగా రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా(Leader of Opposition) బాధ్యతలు చేపట్టాలి. ఇదే సీడబ్ల్యూసీ అభ్యర్థన’’ అని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ చేసిన కృషిని సీడబ్ల్యూసీ తీర్మానం కొనియాడిందని ఆయన చెప్పారు. ‘‘రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మన దేశ రాజకీయాల్లో చారిత్రాత్మక మలుపులు తీసుకొచ్చింది. లక్షలాది మంది కార్మికులు, కోట్లాది మంది ఓటర్లలో ఆశలు, విశ్వాసాన్ని నింపింది’’ అని సీడబ్ల్యూసీ తీర్మానం పేర్కొందని ప్రమోదీ తివారీ చెప్పారు. ఎన్నికల ప్రచారంలో ‘పాంచ్ న్యాయ్ – పచ్చీస్ గ్యారెంటీ’ అంశం కూడా బాగా జనంలోకి వెళ్లిందన్నారు. యువత, మహిళలు, రైతులు, కార్మికులు, దళితులు, ఆదివాసీలు, ఓబీసీలు, మైనారిటీలను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం ద్వారా ఆకట్టుకోగలిగిందని ఆయన తెలిపారు. ‘‘ఈ ఎన్నికల్లో దేశ ప్రజలు సరైన తీర్పు ఇచ్చారు. బీజేపీకి తగిన శాస్తి చేశారు. కాంగ్రెస్ వెంట ఉన్నామని దేశ ప్రజలు చెప్పారు. ప్రజల ఆశలు, ఆశయాలను నెరవేర్చబోయేది కాంగ్రెస్ పార్టీయే’’ అని ప్రమోద్ తివారీ పేర్కొన్నారు. సీడబ్ల్యూసీ సమావేశంలో సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, మనీష్ తివారీ, డీకే శివకుమార్, రేవంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.