PM Modi : ప్రధాని మోడీ పై కాంగ్రెస్ ఎంపీ థరూర్ ప్రశంసలు
యువత తప్పుడు దారిలో అక్రమంగా విదేశాలకు వెళ్తున్నారని.. అలా వెళ్లిన భారత పౌరులను తిరిగి తీసుకురావాలని ఆయన కోరారు. భవిష్యత్తులో ఇటువంటి అక్రమ వలసలను నివారించడానికి అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
- By Latha Suma Published Date - 05:45 PM, Fri - 14 February 25

PM Modi : ప్రధాని మోడీ పై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ప్రశంసలు కురింపించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ప్రధాని మోడీ హుందాగా నడుచుకున్నారని కితాబిచ్చారు. దేశం ఎదురు చూస్తున్న అనేక సమస్యలు త్వరలో పరిష్కారమవ్వనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. డొనాల్డ్ ట్రంప్ తో మోడీ చర్చలు భారత్‌కు ఆశాజనకంగా ఉన్నాయన్నారు. అమెరికా భారత్‌పై టారిఫ్‌లు విధిస్తున్నందున.. మనం కూడా తొందరపాటు చర్యలు తీసుకుంటే ఆ ప్రభావం దేశం నుంచి ఎగుమతయ్యే ఉత్పత్తులపై పడే అవకాశం ఉందన్నారు. ఎఫ్-35 యుద్ధ విమానాలను అమెరికా ఆఫర్ చేయడాన్ని భారత్‌కు శుభ పరిణామంగా శశిథరూర్ పేర్కొన్నారు.
Read Also: Abbaya Chowdary : వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై అట్రాసిటీ కేసు
ఇక ప్రధాని మోడీ అక్రమ వలసదారులపై మాట్లాడుతూ.. చట్టవిరుద్ధంగా అగ్రరాజ్యంలో నివసిస్తున్న భారతీయులను స్వదేశానికి తీసుకొస్తామని వెల్లడించారు. ఒక దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించిన వారికి అక్కడ నివసించే హక్కు ఉండదని, ఈ విధానం ప్రపంచమంతటికీ వర్తిస్తుందని స్పష్టం చేశారు. అయితే మోడీ చేసిన వ్యాఖ్యలను శశిథరూర్ సమర్థించారు. యువత తప్పుడు దారిలో అక్రమంగా విదేశాలకు వెళ్తున్నారని.. అలా వెళ్లిన భారత పౌరులను తిరిగి తీసుకురావాలని ఆయన కోరారు. భవిష్యత్తులో ఇటువంటి అక్రమ వలసలను నివారించడానికి అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కాగా, ప్రధాని మోడీ ఫిబ్రవరి 12న అమెరికా పర్యటనకు వెళ్లారు. ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పలువురు కీలక వ్యక్తులతో వరుస భేటీలు నిర్వహించారు. భద్రత, వాణిజ్యం, భారత్-అమెరికా సంబంధాల్లో రక్షణ, సాంకేతికత సహా పలు అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్) అధినేత ఎలాన్ మస్క్, అమెరికా జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) మైఖేల్ వాల్జ్ కూడా మోదీతో సమావేశమయ్యారు. ఈ కీలక భేటీల అనంతరం శుక్రవారం భారత్‌కు తిరుగు ప్రయాణమయ్యారు.