Central Govt : వాకీటాకీల అమ్మకాలపై కేంద్రం ఆంక్షలు
టెలికం భద్రతకు ముప్పుగా మారే అవకాశం ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం పేర్కొంది. ఇది టెలిగ్రాఫ్ యాక్ట్ 1885, వైర్‌లెస్ టెలిగ్రఫీ యాక్ట్ 1933 వంటి చట్టాల ప్రకారం తీసుకున్న చర్య. ఈ చట్టాల ప్రకారం, ఎవరి వద్దనైనా అనుమతిలేకుండా వాకీటాకీలు లభించడం, వాడటం నిషిద్ధం.
- By Latha Suma Published Date - 12:48 PM, Sun - 1 June 25

Central Govt : దేశ భద్రత అంశాన్ని దృష్టిలో ఉంచుకుని, కేంద్ర ప్రభుత్వం రేడియో పరికరాలు, వాకీటాకీల అమ్మకాలపై కఠిన మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా అనుమతి లేకుండా వాకీటాకీలు అమ్మకాన్ని నిలిపివేయాలంటూ ప్రభుత్వం స్పష్టమైన గైడ్‌లైన్స్‌ను విడుదల చేసింది. టెలికం భద్రతకు ముప్పుగా మారే అవకాశం ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం పేర్కొంది. ఇది టెలిగ్రాఫ్ యాక్ట్ 1885, వైర్‌లెస్ టెలిగ్రఫీ యాక్ట్ 1933 వంటి చట్టాల ప్రకారం తీసుకున్న చర్య. ఈ చట్టాల ప్రకారం, ఎవరి వద్దనైనా అనుమతిలేకుండా వాకీటాకీలు లభించడం, వాడటం నిషిద్ధం. ఇటీవల కాశ్మీర్‌లోని పహల్గామ్ వద్ద చోటుచేసుకున్న ఉగ్రదాడి తర్వాత భద్రతాపరమైన ఆందోళనలు తీవ్రమయ్యాయి. ఆ దాడి అనంతరం అనధికార వాకీటాకీ పరికరాల వినియోగం పై అనుమానాలు వెల్లివిరిగాయి. ఈ పరిణామాల నేపథ్యంలో, సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) ఈ కామర్స్ సంస్థలపై కళ్లెం వేసింది.
Read Also: Miss World Winner : మిస్ వరల్డ్ విన్నర్ కు దక్కే ప్రయోజనాలు తెలిస్తే మతి పోవాల్సిందే..!
ఈ మేరకు ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో, మెటా (ఫేస్‌బుక్), చిమియా వంటి సంస్థలకు అధికారిక నోటీసులు జారీ అయ్యాయి. ఈ సంస్థల ప్లాట్‌ఫామ్‌లలో అనుమతి లేని వాకీటాకీ పరికరాలు పెద్ద సంఖ్యలో అమ్మకానికి ఉంచినట్లు గుర్తించారు. ముందస్తు అనుమతులు లేకుండా ఇలాంటి పరికరాలను జాబితాలో చేర్చడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రాథమిక దర్యాప్తులో వందలాది ఉత్పత్తులు నియమాలకు అనుగుణంగా లేవన్న విషయం వెలుగులోకి వచ్చింది. అందుకే ఆయా సంస్థలకు ఆ ఉత్పత్తులను వెంటనే డీలిస్ట్ చేయాలని సూచించడమే కాక, భవిష్యత్తులో ఇలాంటి ఉల్లంఘనలు జరగకుండా చూసుకోవాలని స్పష్టం చేసింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో, మెటా వంటి సంస్థలు వెంటనే స్పందించి తమ ప్లాట్‌ఫామ్‌లలో ఉన్న వాకీటాకీ పరికరాల జాబితాను తొలగించాయి.
అయితే, టాక్ ప్రో, మాక్‌మాన్ టాయ్స్ వంటి సంస్థలు మాత్రం ఇంకా ఆ ఉత్పత్తులను తమ వెబ్‌సైట్లలో ప్రదర్శిస్తున్నాయి. ఈ సంస్థలు నిబంధనలను పాటించడంలో జాప్యం చేస్తున్నాయని భావిస్తున్న ప్రభుత్వం, తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నదని సంకేతాలిచ్చింది. ఇండియామార్ట్ కూడా ఇలాంటి ఉత్పత్తులను జాబితాలో ఉంచినట్టు తెలుస్తోంది. OLX, కృష్ణ మార్ట్, వర్దాన్ మార్ట్, ట్రేడ్ ఇండియా వంటి ఇతర సంస్థలు ఈ విషయం పై ఇప్పటివరకు స్పందించలేదు. ఈ చర్యలన్నీ ప్రజా భద్రతను దృష్టిలో ఉంచుకొని తీసుకున్నవేనని కేంద్రం స్పష్టం చేసింది. భవిష్యత్తులో దేశ భద్రతకు ముప్పుగా మారే ఉత్పత్తుల అమ్మకాన్ని నియంత్రించేందుకు మరింత కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ సందర్భంగా వినియోగదారులు కూడా గుర్తించి, అనధికార రేడియో పరికరాల కొనుగోలును నివారించాలని సూచించింది.