Sonia Gandhi: సోనియా ముందు 4 సవాళ్లు.. అలా చేస్తే అధికారం ఖాయమేనా!
- By hashtagu Published Date - 09:59 AM, Mon - 14 March 22

ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పేదే మాట.. నడిచేదే బాట. కానీ ఇప్పుడు ఒక ప్రాంతీయ పార్టీ కన్నా దారుణంగా తయారైంది దాని పరిస్థితి. దీంతో సోనియాగాంధీ స్వయంగా రంగంలోకి దిగే అవకాశాలున్నాయి. కానీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి రావడానికి ముందు ఆమెకు నాలుగు సవాళ్లు ఎదురవుతున్నాయి. వాటిని ఎలా ఎదుర్కోబోతున్నారు అన్నదానిపైనే సోనియా విజయం కాని, కాంగ్రెస్ గెలుపు కాని ఆధారపడి ఉన్నాయి.
ఇప్పటికే వరుస ఓటములతో పార్టీలో నిస్తేజం నెలకొంది. ఆ నెపమంతా రాహుల్ గాంధీ, ప్రియాంకలపై నెడుతున్నారు సీనియర్లు. అంటే ముందు రాహుల్, ప్రియాంకల పొలిటికల్ ఇమేజ్ ను పెంచాలి. అది పార్టీకి కూడా మైలేజ్ ను పెంచుతుంది. పైగా రాహుల్ గాంధీ స్పీచ్ లు ఇంకా పదునుదేరాల్సి ఉంది. మాటల మాంత్రికుడు అయిన మోదీని ఢీకొట్టాలంటే.. ఆ స్థాయిలో ఆయన ప్రసంగాలు ఉండాలి. ఇక ప్రియాంక గాంధీ వాద్రా.. ఉత్తరప్రదేశ్ లో ఏమీ ప్రభావం చూపలేకపోయారన్న అపవాదును తొలగించాలి. ఆమె స్థాయిని పెంచి చూపించాలి. దీనికి పొలిటికల్ స్ట్రాటజిస్టులను ఆశ్రయిస్తారా లేక పార్టీయే ఈ పనిచేస్తుందా అన్నది చూడాలి.
గెలిచినోడు అందరికీ హీరోనే. ఓడినోడే మరీ లోకువైపోతాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అదే జరుగుతోంది. అందుకే కాంగ్రెస్ ను తమ పార్టీలో కలిపేయాలని తృణమూల్ కాంగ్రెస్ సెటైర్లు వేస్తోంది. ఆఖరికి ఒక ప్రాంతీయ పార్టీ ఈ స్థాయిలో కామెంట్ చేయగలిగిందీ అంటే.. అది కాంగ్రెస్ కు ఎంతటి పరాభవమో ఆలోచించాలి. అదే సమయంలో తన నాయకత్వ పటిమను పెంచుకుని… తాను ప్రతిపక్షాలను సక్రమంగా నడిపించగలనన్న విశ్వాసాన్ని వారిలో పెంచాలి.
పార్టీకి పక్కలో బల్లెంలా తయారైన కొందరు సీనియర్ల విషయంలో ఇప్పటికైనా ఓ నిర్ణయం తీసుకోవాలి. పార్టీ కోవర్టులను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదు. తిన్నింటివాసాలను లెక్కబెడుతున్నవారు ఎవరో గమనించి.. వారికి చెక్ పెడితేనే మంచిది. లేదా తెలివిగా వారిని పార్టీలోనే కొనసాగిస్తూ.. వారి సేవలను ఉపయోగించుకుంటారా అన్నది చూడాలి. కానీ సోనియాగాంధీ ఇప్పుడున్న పరిస్థితుల్లో యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండడం కష్టం. అంటే రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీలే సీరియస్ గా తీసుకోవాలి. క్షేత్రస్థాయిలో తమ శ్రేణులు పోరాడేలా స్ఫూర్తినివ్వాలి. అప్పుడే ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది. ఓటు బ్యాంకూ పెరుగుతుంది. రెండు రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు పూర్వవైభవం తేవడానికి సాధ్యమవుతుంది.