PM Modi : నేడు ప్రధాని అధ్యక్షతన భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ భేటీ
దేశ భద్రతపై అత్యున్నత నిర్ణయాలు తీసుకొనే క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఈ రోజు రెండోసారి సమావేశం కానుంది. అలాగే రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ భేటీ కూడా జరగనుంది. అలాగే ఈరోజు సాయంత్రం క్యాబినెట్ సమావేశం కూడా నిర్వహించనున్నారు.
- By Latha Suma Published Date - 11:48 AM, Wed - 30 April 25

PM Modi : ప్రస్తుతం భారత్-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగి యుద్ధం వస్తుందనే ఊహాగానాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే బుధవారం ప్రధాని నరేంద్రమోడీ పలు కీలక సమావేశాలకు అధ్యక్షత వహించనున్నారు. దేశ భద్రతపై అత్యున్నత నిర్ణయాలు తీసుకొనే క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఈ రోజు రెండోసారి సమావేశం కానుంది. అలాగే రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ భేటీ కూడా జరగనుంది. అలాగే ఈరోజు సాయంత్రం క్యాబినెట్ సమావేశం కూడా నిర్వహించనున్నారు. ఈ కమిటీలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్ సహా పలువురు సీనియర్ మంత్రులు ఉన్నారు.
Read Also: Pahalgam Terror Attack : అసలు సూత్రధారి ఇతడే !
ఉగ్రదాడి ఘటన తర్వాత సీసీఎస్ భేటీ కావడం ఇది రెండోసారి. ఘటన జరిగిన వెంటనే ఈ కమిటీ ఒకసారి భేటీ అయిన విషయం తెలిసిందే. ఆ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సింధు జలాల ఒప్పందం నిలిపివేత , దౌత్య సంబంధాల తగ్గింపు, అటారీ సరిహద్దు మూసివేత, పాక్ జాతీయుల వీసా రద్దు తదితర నిర్ణయాలు తీసుకుంది. తాజా భేటీలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సీసీఏ భేటీ తర్వాత ప్రధాని మోడీ అధ్యక్షతన రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ కూడా సమావేశం కానుంది.
ఈ సమావేశాలన్నింటికీ పహల్గాం దాడే ప్రధాన అజెండా అని తెలుస్తోంది. పహల్గాం దాడి తర్వాత కేంద్ర కేబినెట్ సమావేశం అవుతుండడం ఇదే తొలిసారి. పాక్‌కు బుద్ధి చెప్పేందుకు తీసుకోవాల్సిన సైనిక, రాజకీయ, ఆర్థికపరమైన నిర్ణయాలను సీసీఎస్ తదితర భేటీల్లో ఖరారు చేస్తారు. అనంతరం జరిగే మంత్రివర్గం భేటీలో వాటికి ఆమోదముద్ర వేస్తారు అని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
కాగా, సీసీపీఏ అనేది అత్యంత శక్తివంతమైన గ్రూప్. దానిని సూపర్ క్యాబినెట్ అని కూడా పిలుస్తారు.సీసీపీఏ 2019లో జరిగిన పుల్వామా ఉగ్రదాడి తర్వాత సమావేశమైంది. పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ వాహనంపై జరిగిన దాడిలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దానిపై దేశంలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఈ దారుణ ఘటనపై ప్రతీకార చర్యలు, పరిస్థితిని సమీక్షించేందుకు ఆనాడు సీసీపీఏ సమావేశమైంది. మళ్లీ ఆ క్యాబినెట్ సమావేశం కాలేదు. ఆ ఏడాదిలో కొన్ని రోజుల తర్వాత, ఫిబ్రవరి 26న భారత వైమానిక దళం బాలాకోట్‌లోని ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడి చేసి, దాయాదికి గట్టి సమాధానం ఇచ్చింది. ఆ సమావేశంలోనే పాకిస్థాన్‌కు ఉన్న అత్యంత అనుకూల దేశం వాణిజ్య హోదాను రద్దు చేయాలని భారత్ నిర్ణయించింది.
Read Also: Simhachalam Incident : మృతుల కుటుంబాలకు రూ.25లక్షల పరిహారం : సీఎం చంద్రబాబు