Simhachalam Incident : మృతుల కుటుంబాలకు రూ.25లక్షల పరిహారం : సీఎం చంద్రబాబు
మృతుల కుటుంబాలకు రూ.25లక్షలు, గాయపడిన వారికి రూ.3లక్షల చొప్పున పరిహారం అందజేయాలని సీఎం ఆదేశించారు. ప్రమాదం జరిగిన తీరు, క్షతగాత్రులకు అందుతున్న వైద్య సాయంపై సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు.
- By Latha Suma Published Date - 11:27 AM, Wed - 30 April 25

Simhachalam Incident : ముఖ్యమంత్రి చంద్రబాబు సింహాచలం ఘటన పై మంత్రులు, ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయశాఖ పరిధిలోని ఆలయాల్లో అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగ అవకాశం కల్పించాలన్నారు. మృతుల కుటుంబాలకు రూ.25లక్షలు, గాయపడిన వారికి రూ.3లక్షల చొప్పున పరిహారం అందజేయాలని సీఎం ఆదేశించారు. ప్రమాదం జరిగిన తీరు, క్షతగాత్రులకు అందుతున్న వైద్య సాయంపై సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనపై ముగ్గురు సభ్యుల కమిటీతో విచారణకు ఆయన ఆదేశించారు. మరోవైపు గోడ కూలిన ప్రదేశంలో శిథిలాలను వెంటనే తొలిగించి భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. వేలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.
Read Also: Rohit Sharma Birthday: 38వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన టీమిండియా కెప్టెన్.. సెలెబ్రేషన్స్ వీడియో ఇదే!
ఈ టెలీకాన్ఫరెన్స్‌లో మంత్రులు అనిత, డోలా బాల వీరాంజనేయ స్వామి, ఆనం రామనారాయణరెడ్డి, అనగాని సత్యప్రసాద్, ఎంపీ భరత్, సింహాచల దేవస్థాన అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు తదితరులు పాల్గొన్నారు. మరోవైపు ఈ ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి నుంచి ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున అందజేయనున్నట్లు వెల్లడించారు.
కాగా, విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో ఏడుగురు మృతి చెందారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. స్వామి నిజరూపాన్ని దర్శించుకునేందుకు తరలివచ్చిన రాత్రి భక్తులు అక్కడే బస చేశారు. బుధవారం వేకువ జామున 2.30 గంటల ప్రాంతంలో నిద్రిస్తున్న భక్తులపై గోడ కూలింది. మృతదేహాలను విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు.