IndiGo Flight: బాంబు బెదిరింపు కలకలం.. ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
- By Gopichand Published Date - 07:52 AM, Tue - 28 May 24

IndiGo Flight: మంగళవారం ఉదయం ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానం (IndiGo Flight)లో బాంబు ఉన్నట్లు సమాచారం అందింది. ఈ ఘటన తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో జరిగింది. బాంబు వార్త తెలియగానే ప్రయాణికులు, సిబ్బందిలో భయాందోళనలు నెలకొన్నాయి. ప్రయాణికులను అత్యవసర ద్వారం నుండి అత్యవసరంగా ఖాళీ చేయించారు. విచారణ కోసం విమానాన్ని ఐసోలేషన్ బేకు తరలించారు.
విమానయాన భద్రత, బాంబు నిర్వీర్య బృందం ప్రస్తుతం ఘటనా స్థలంలో ఉన్నట్లు విమానాశ్రయ అధికారి ANIకి తెలిపారు. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ మొత్తం విమానంలో ప్రతి మూలలో సోదా చేసింది. ప్రతి ప్రయాణికుడి లగేజీని తనిఖీ చేయగా ఇప్పటి వరకు అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు. విమానాశ్రయ అధికారులు పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బాంబు గురించి సమాచారం ఇచ్చిన వ్యక్తి కోసం వెతకాలని కోరారు.
బాంబు గురించి సమాచారం
అందిన సమాచారం ప్రకారం.. ఇండిగో విమానం ఉదయం 5.15 గంటలకు ఢిల్లీ ఐజిఐ విమానాశ్రయం నుండి బయలుదేరింది. విమానం టేకాఫ్ అయిన వెంటనే సిబ్బందికి టాయిలెట్‌లో ఓ పేపర్ కనిపించింది. దానిపై విమానంలో బాంబు ఉందని సందేశం రాసి ఉంది. దీంతో సిబ్బంది, ప్రయాణికుల్లో భయాందోళన నెలకొంది. వెంటనే ఏటీసీ, విమానాశ్రయ అధికారులు విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
Also Read: Electric Scooters: జోరు పెంచిన ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు
విమానం ల్యాండ్ అయిన వెంటనే భద్రతా సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్స్ లు రన్ వేపైకి చేరుకున్నాయి. ప్రయాణికులను ఎమర్జెన్సీ గేటు నుంచి దించి సేఫ్ జోన్‌కు తరలించారు. అనంతరం విమానం కోసం బాంబు, డాగ్ స్క్వాడ్ సోదాలు నిర్వహించింది. విమానంలో బాంబు ఉందన్న సమాచారం అందిన వెంటనే ఢిల్లీ పోలీసు శాఖ ఉన్నతాధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
ఇండిగో ప్రకటన
ఢిల్లీ నుంచి వారణాసికి నడుపుతున్న ఇండిగో ఫ్లైట్ 6E2211కి నిర్దిష్ట బాంబు బెదిరింపు వచ్చింది. అవసరమైన అన్ని ప్రోటోకాల్‌లను అనుసరించాం. విమానాశ్రయ భద్రతా ఏజెన్సీల మార్గదర్శకాల ప్రకారం విమానాన్ని రిమోట్ బేకు తీసుకెళ్లారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ల ద్వారా ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చాం. ప్రస్తుతం విమానం తనిఖీలో ఉంది. అన్ని భద్రతా తనిఖీలు పూర్తయిన తర్వాత విమానం టెర్మినల్ ప్రాంతంలో తిరిగి ఉంచబడుతుందని ఇండిగో అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
We’re now on WhatsApp : Click to Join
ఢిల్లీలోని పాఠశాలలు, విమానాశ్రయాలకు బెదిరింపులు వచ్చాయి
ఈ నెల ప్రారంభంలో ఢిల్లీలోని 150కి పైగా ప్రైవేట్ పాఠశాలలకు కూడా బాంబు బెదిరింపులు వచ్చినట్లు మనకు తెలిసిందే. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్, సఫ్దర్‌జంగ్ హాస్పిటల్ లాంటి పెద్ద ఆసుపత్రులకు కూడా చాలాసార్లు బాంబు బెదిరింపులు వచ్చాయి. తనిఖీల్లో అనుమానాస్పదంగా ఏమీ కనిపించనప్పటికీ ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు కూడా బెదిరింపులకు పాల్పడిన వారి జాడ తెలియకపోగా, ఇలాంటి బెదిరింపులు రావడంతో పోలీసు శాఖ అప్రమత్తంగా ఉంటుంది.