Delhi Water Crisis: 2 రోజుల్లో ఢిల్లీలో తీవ్ర నీటి సంక్షోభం: అతిషి
పొరుగు రాష్ట్రం హర్యానా ఢిల్లీకి అదనపు నీటిని విడుదల చేయకపోతే, మరో ఒకటి లేదా రెండు రోజుల్లో దేశ రాజధానిలో తీవ్ర నీటి సంక్షోభం ఎదుర్కోవాల్సి వస్తుందని ఢిల్లీ జల మంత్రి అతిషి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్‌కు లేఖ రాశారు.
- Author : Praveen Aluthuru
Date : 09-06-2024 - 4:53 IST
Published By : Hashtagu Telugu Desk
Delhi Water Crisis: పొరుగు రాష్ట్రం హర్యానా ఢిల్లీకి అదనపు నీటిని విడుదల చేయకపోతే, మరో ఒకటి లేదా రెండు రోజుల్లో దేశ రాజధానిలో తీవ్ర నీటి సంక్షోభం ఎదుర్కోవాల్సి వస్తుందని ఢిల్లీ జల మంత్రి అతిషి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్‌కు లేఖ రాశారు. గత కొన్ని రోజులుగా హర్యానా మునక్ కెనాల్‌లోకి సరిపడా నీటిని విడుదల చేయడం లేదని అతిషి లేఖలో రాశారు. దీంతో దేశ రాజధాని ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆమె పేర్కొన్నారు.
2018 మేలో ఎగువ యమునా రివర్ బోర్డు 53వ సమావేశంలో కుదిరిన ఒప్పందం ప్రకారం ముండక్ కెనాల్ ద్వారా ఢిల్లీకి 1,050 క్యూసెక్కుల (రోజుకు 568 మిలియన్ గ్యాలన్లు) నీరు ఇవ్వాల్సి ఉందని లేఖలో పేర్కొన్నారు. మార్గంలో నీటి నష్టాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఢిల్లీకి 1,013 క్యూసెక్కుల (రోజుకు 548 మిలియన్ గ్యాలన్లు) నీరు చేరాలి.
తక్కువ మొత్తంలో నీటి లభ్యత కారణంగా ఢిల్లీలోని ఏడు నీటి శుద్ధి ప్లాంట్లు ఇక్కడి ప్రజలకు సరిపడా నీటిని శుద్ధి చేయలేకపోతున్నాయని అన్నారు. కాబట్టి హర్యానా సరిపడా నీటిని విడుదల చేయకుంటే మరో ఒకటి రెండు రోజుల్లో ఢిల్లీలో పెద్ద నీటి ఎద్దడి ఏర్పడుతుందని అన్నారు. ఢిల్లీకి ముండక్ కెనాల్‌లో కనీసం 1050 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని హర్యానా ముఖ్యమంత్రిని అతిషి అభ్యర్థించారు.
Also Read: Modi Oath Taking Ceremony: మోదీ ప్రమాణ స్వీకారానికి ఖర్గే హాజరు