Aap Ka Ram Rajya : ‘ఆప్ కా రామ్ రాజ్య’ విడుదలైంది.. ఏమిటో తెలుసా ?
Aap Ka Ram Rajya : ఎన్నికల వేళ శ్రీరామనవమిని పురస్కరించుకొని ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.
- By Pasha Published Date - 01:25 PM, Wed - 17 April 24

Aap Ka Ram Rajya : ఎన్నికల వేళ శ్రీరామనవమిని పురస్కరించుకొని ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. “రామరాజ్యం” అనే భావనతో తమ పార్టీ పనిచేస్తుందనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో ఇవాళ ‘ఆప్ కా రామ్ రాజ్య’ (Aap Ka Ram Rajya) పేరుతో ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించింది.ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దేశ రాజధానిలో రాముడి ఆదర్శాలను సాకారం చేసేందుకు ప్రయత్నించారని ఆ వెబ్‌సైట్‌లో ప్రస్తావించారు. ప్రజా సంక్షేమం, పేదల అభ్యున్నతి, సామాన్యులకు చేరువగా విద్య, వైద్య వసతులను ఆప్ సర్కారు తీసుకెళ్లిన తీరు గురించి ఇందులో వివరించారు.
We’re now on WhatsApp. Click to Join
ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన సందర్బంగా మీడియా సమావేశంలో ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ మాట్లాడారు. ‘‘ఢిల్లీలో రామరాజ్యం సాకారం కోసం గత 10 ఏళ్లలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఎన్నో అద్భుతమైన పనులు చేశారు. ప్రజల కోసం మంచి పాఠశాలలు, మొహల్లా క్లినిక్‌లు, ఉచిత నీరు, విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి వాటిని అమలు చేశారు’’ అని ఆయన చెప్పారు. కేజ్రీవాల్ సీఎంగా కంటిన్యూ అయితేనే ఈ సంక్షేమ ఫలాలు కంటిన్యూగా పేదలకు అందుతాయని తెలిపారు. ఢిల్లీలోని అన్ని లోక్‌సభ స్థానాల్లో ఆప్‌ను గెలిపించాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందన్నారు. ఈవిషయాన్ని ఇప్పటికే ప్రజలు గ్రహించారని పేర్కొన్నారు. విపక్ష నేతలను ఇబ్బందుల్లో పెట్టడమే లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కారు పనిచేస్తోందని సంజయ్ సింగ్ ఆరోపించారు.
Also Read :X Posts Vs EC : ఈసీ ఆర్డర్.. టీడీపీ, వైఎస్సార్ సీపీల ‘ఎక్స్’ పోస్టులు డిలీట్
‘‘ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు. అరవింద్ కేజ్రీవాల్ తన ప్రజల మధ్య లేకపోవడం ఇదే మొదటిసారి. తప్పుడు సాక్షుల వాంగ్మూలాలను పరిగణనలోకి తీసుకుని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను నిరాధారమైన కేసులో జైలుకు పంపారు’’ అని సంజయ్ సింగ్ చెప్పారు. ఎన్ని కష్టాలు, నష్టాలు వచ్చినా.. నమ్ముకున్న సిద్దాంతానికి కట్టుబడి ఉన్న బలమైన నాయకత్వం అరవింద్ కేజ్రీవాల్ ది అని ఆయన కొనియాడారు.