Odisha Train Accident : 40 మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేవు..! అసలు విషయాన్ని బయటపెట్టిన రైల్వే అధికారులు
ఈ రైలు ప్రమాదంలో ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాదంలో మరణించిన 40 మంది శరీరంపై ఎలాంటి గాయాలు లేవని అధికారులు గుర్తించారు.
- By News Desk Published Date - 10:30 PM, Tue - 6 June 23

ఒడిశా(Odisha Train Accident)లో మూడు రైళ్లు ఢీకొని ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. భారతీయ రైల్వే(indian Railway) చరిత్రలోనే ఇది భారీ ప్రమాదం. ఈ ఘోర ప్రమాదంలో 278 మంది దుర్మరణం చెందారు. వందల మంది గాయపడ్డారు. అయితే, వీరిలో కొందరు చికిత్స అనంతరం తమ స్వస్థలాలకు వెళ్లారు. 200 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ఘోర ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ ప్రమాదంలో ఉగ్ర కుట్ర దాగి ఉందన్న వాదన వినిపిస్తోంది. ప్రతిపక్షాలుసైతం ఈ ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. రైల్వే మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైలు ప్రమాదానికి కారణం ఏమిటనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకొనేందుకు విచారణను సీబీఐకి ప్రభుత్వం అప్పగించింది. సీబీఐ అధికారులు మంగళవారం ఉదయం ప్రమాద స్థలికి చేరుకొని విచారణసైతం ప్రారంభించారు. అయితే, ఈ రైలు ప్రమాదంలో ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ ప్రమాదంలో మరణించిన 40 మంది శరీరంపై ఎలాంటి గాయాలు లేవని అధికారులు గుర్తించారు. రైలు బోగీల నుంచి మృతదేహాలను బయటకు తీసే క్రమంలో 40 మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేని విషయాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని ప్రభుత్వ రైల్వే పోలీసులు కూడా తమ ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ఇందుకు కారణం.. ప్రమాదం జరిగిన సమయంలో లైవ్ ఓవర్ హెడ్ కేబుల్ తెగి బోగీలపై పడిందని, దీంతో విద్యుదాఘాతంతో 40 మంది ఎలాంటి గాయాలు లేకుండానే మరణించారని రైల్వే పోలీసులు తెలిపారు.
Also Read : Odisha Train Accident: రైలు టికెట్లను రద్దు చేసుకుంటున్న ప్రయాణికులు