Noida Wall Collapse : గోడకూలి నలుగురు మృతి…8 మందికి గాయాలు..!!
నోయిడాలో ఘోరం జరిగింది. నిర్మాణంలో ఉన్న గోడకూలి నలుగురు మరణించారు.
- By hashtagu Published Date - 12:38 PM, Tue - 20 September 22

నోయిడాలో ఘోరం జరిగింది. నిర్మాణంలో ఉన్న గోడకూలి నలుగురు మరణించారు. అక్కడపనిచేస్తున్న 12మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. ఈ ఘటన నోయిడా సెక్టార్ 21లోని జలవాయు విహారలో ఈ ఉదయం జరిగింది. సమాచారమందుకున్న సెక్టార్ -20 కొత్వాలి పోలీసులు, అగ్నిమాపక దళం బృందం ఐదు జేసీబీల సహాయంతో శిథిలాలను తొలగించి కార్మికులను బయటకు తీశారు. ప్రమాదంలో నలుగురు కార్మికులకు తీవ్రగాయాలవ్వడంతో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వారు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. మిగిలిన వారిని శిథిలాల నుంచి సురక్షితంగా బయటకు తీసినట్లు పోలీసులు తెలిపారు.
నోయిడా అథారిటీ తరపున సెక్టార్-21లో ఉన్న జలవాయు విహార్ సొసైటీ సమీపంలోని డ్రెయిన్ పాత గోడను పగులగొట్టి కొత్తగా నాలుగు గోడలు నిర్మించే పనులు జరుగుతున్నాయి. మంగళవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న డ్రెయిన్‌కు ఆరు అడుగుల ఎత్తు, పది అడుగుల పొడవున్న గోడ కూలిపోవడంతో 12 మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు సుమారు గంటపాటు రెస్క్యూ ఆపరేషన్ తర్వాత శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించారు. ప్రమాదంలో గాయపడిన ఇద్దరు కార్మికులను సెక్టార్-27లోని కైలాష్ ఆసుపత్రిలో, ఇద్దరు కార్మికులను సెక్టార్-30లోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సీఎం యోగిఆదిత్యానాథ్ మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.