Toothpaste: ఏ వయస్సులో పిల్లలు టూత్‌పేస్ట్ వాడాలి?
దంతాల నిపుణులు మాట్లాడుతూ.. పిల్లలు పూర్తిగా దంతాలు వచ్చిన తర్వాత టూత్‌పేస్ట్‌ను ఉపయోగించడం ప్రారంభించవచ్చని తెలిపారు.
- Author : Gopichand
Date : 22-02-2025 - 6:03 IST
Published By : Hashtagu Telugu Desk
Toothpaste: పిల్లలైనా, పెద్దలైనా ప్రతి ఒక్కరూ ఉదయం లేవగానే ముందుగా గుర్తుకు వచ్చేది టూత్‌పేస్టు (Toothpaste). ఇది మన దంతాలను ఆరోగ్యంగా ఉంచడం లేదా మన నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవటం కోసం టూత్‌పేస్టుతో దంతాలను శుభ్రం చేస్తుంటాం. ఈ కారణంగానే చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఒక వయసు వచ్చేవరకు టూత్‌పేస్ట్‌ను దూరంగా ఉంచుతారు. అయితే పిల్లలు పుట్టిన ఎన్ని సంవత్సరాల తర్వాత టూత్‌పేస్ట్ వాడాలి? అనే విషయంలో తల్లిదండ్రులు తరచుగా ఆందోళన చెందుతూ ఉంటారు. మీరు కూడా మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉండి టూత్‌పేస్ట్ విషయంలో ఆందోళన చెందుతున్నారా? ఏ వయస్సులో పిల్లలు టూత్ బ్రషింగ్ ప్రారంభించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
దంతాల నిపుణులు మాట్లాడుతూ.. పిల్లలు పూర్తిగా దంతాలు వచ్చిన తర్వాత టూత్‌పేస్ట్‌ను ఉపయోగించడం ప్రారంభించవచ్చని తెలిపారు. కానీ తక్కవ మోతాదులో టూత్‌పేస్ట్ ఉపయోగించడం ప్రారంభించాలని చెబుతున్నారు. పిల్లలకు రెండు సంవత్సరాల వయస్సులో బఠానీ గింజ మోతాదులో టూత్‌పేస్ట్ ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలు బ్రష్ చేసేటప్పుడు పొరపాటున కూడా టూత్ పేస్ట్ మింగకుండా జాగ్రత్తపడాలి. ఇది హానికరమైన రసాయనాలను కలిగి ఉంటుంది. ఇది పిల్లల ఆరోగ్యానికి హానికరం.
Also Read: Bhatti Vikramarka : తెలంగాణలో వృద్ధి నేపథ్యంలో భద్రతా చర్యలు పటిష్టం
2 నుండి 5 సంవత్సరాల వయస్సు సరైనది
పిల్లలు 2 నుండి 5 సంవత్సరాల మధ్య టూత్‌పేస్ట్‌ను ఉపయోగించడం ప్రారంభించవచ్చని, అయితే దాని పరిమాణం చాలా తక్కువగా ఉండాలని దంత నిపుణులు అంటున్నారు. పిల్లలకు ఫ్లోరైడ్ టూత్ పేస్టు మాత్రమే ఇవ్వవాలని, పిల్లల కోసం ఒక చిన్న బ్రష్ వాడాలని పేర్కొన్నారు. అంతేకాకుండా పిల్లలకు బ్రష్ చేయడం నేర్పించాలని సూచించారు. మధ్యమధ్యలో పేస్ట్ ఉమ్మివేయడం గురించి పిల్లలకు చెబుతూ ఉండాలని.. చిన్న వయస్సులోనే కావిటీలను నివారించడానికి, సరైన బ్రషింగ్ పద్ధతుల గురించి పిల్లలకు నేర్పించాలని అంటున్నారు. పిల్లలు టూత్‌పేస్ట్‌ను మింగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు.
మీరు మీ పిల్లలకు టూత్‌పేస్ట్ ఇవ్వకూడదనుకుంటే.. నూనె, ఉప్పు, పసుపును కలిపి పేస్టులా చేసి దంతాలను శుభ్రం చేయండి. ఇది దంతాలను శుభ్రపరచడంలో సహాయపడుతుంది. దీంతో చిగుళ్లు బలంగా తయారవుతాయి. ఇది చిన్న పిల్లలతో పాటు వృద్ధులు కూడా పాటించవచ్చు.