Processed Food : ప్రాసెస్డ్ ఫుడ్స్ తక్కువ తిన్నా ప్రమాదమేనా?.. తాజా అధ్యయనంలో షాకింగ్ నిజాలు..!
ముఖ్యంగా ప్రాసెస్ చేసిన మాంసం, చక్కెర కలిపిన పానీయాలు, ట్రాన్స్ ఫ్యాట్‌లతో కూడిన ఆహారాలు అత్యంత హానికరమని అధ్యయనంలో వెల్లడైంది. ఈ పరిశోధనను అమెరికాలోని ప్రఖ్యాత యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్"కు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ (IHME) నిర్వహించింది.
- By Latha Suma Published Date - 12:58 PM, Wed - 9 July 25

Processed Food : ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను “మితంగా తింటే సరిపోతుందన్న” నమ్మకం చాలా మందిలో ఉంది. అయితే, ఈ నమ్మకం అపోహ మాత్రమేనని తాజా గ్లోబల్ అధ్యయనం తేల్చిచెప్పింది. రోజూ కేవలం తక్కువ మోతాదులో తిన్నా కూడా దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం గణనీయంగా పెరిగే అవకాశముందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ప్రాసెస్ చేసిన మాంసం, చక్కెర కలిపిన పానీయాలు, ట్రాన్స్ ఫ్యాట్‌లతో కూడిన ఆహారాలు అత్యంత హానికరమని అధ్యయనంలో వెల్లడైంది. ఈ పరిశోధనను అమెరికాలోని ప్రఖ్యాత యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్”కు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ (IHME) నిర్వహించింది. దీని ఫలితాలను ప్రఖ్యాత వైద్య జర్నల్ నేచర్ మెడిసిన్ లో ఇటీవల ప్రచురించారు. అధ్యయనంలో ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు దేశాల ప్రజల ఆహారపు అలవాట్లను విశ్లేషించారు.
Read Also: Accident : కూలిన గుజరాత్‌లో మహీసాగర్ వంతెన.. ట్రక్కు, ట్యాంకర్ నదిలోకి
ఈ అధ్యయన ప్రకారం, రోజుకు కేవలం 0.6 నుండి 57 గ్రాముల మధ్య ప్రాసెస్ చేసిన మాంసం తినేవారిలో టైప్ 2 మధుమేహం వచ్చే అవకాశాలు 11 శాతం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అలాగే, 0.78 నుండి 55 గ్రాముల మధ్య ప్రాసెస్ మాంసం తీసుకునే వారిలో పెద్దప్రేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం 7 శాతం పెరుగుతుందని తేలింది. అంటే తక్కువ మోతాదులో తీసుకున్నా ప్రమాదం తక్కువయ్యేదే కాదు, వ్యాధుల ముప్పు గణనీయంగా పెరుగుతోంది. ఇటు చక్కెర కలిపిన శీతల పానీయాలు తాగే వారికీ ఆరోగ్య సమస్యలు తప్పవని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. రోజుకు 1.5 గ్రాముల నుండి 390 గ్రాముల వరకు చక్కెరపానీయాలు తాగే వారిలో టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు 8 శాతం ఎక్కువగా ఉన్నాయని చెబుతోంది. ముఖ్యంగా రోజుకు ఒక సర్వింగ్ తాగిన వారికీ వ్యాధుల ముప్పు తగ్గడం లేదు. అంత తక్కువ మోతాదులోనూ ప్రమాదం మామూలుగా ఉండటం లేదు.
అంతేకాదు, ప్రాసెస్ చేసిన మాంసంలో ఉపయోగించే నైట్రైట్, నైట్రేట్ వంటి రసాయనాలు శరీర కణాల్లో మార్పులకు కారణమవుతూ క్యాన్సర్‌కు దారితీస్తాయని అధ్యయనంలో హెచ్చరించారు. అదే విధంగా, అధిక చక్కెర కలిగిన పానీయాలు జీవక్రియ (మెటబాలిక్) సమస్యలకు దారితీయగలవని వెల్లడించారు. ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్న స్నాక్స్, వెండి ప్యాకింగ్‌లో దొరికే జంక్ ఫుడ్స్ కూడా గుండె జబ్బులు, అధిక రక్తపోటు వంటి సమస్యలకు దారితీయవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఇలా తక్కువగా తీసుకుంటే ప్రమాదం తక్కువగా ఉంటుందని అనుకోవడం పూర్తిగా తప్పని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రాసెస్ చేసిన ఆహారాల వాడకాన్ని గణనీయంగా తగ్గించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వాలు, ఆరోగ్య సంస్థలు ఈ విషయంలో ప్రజలకు అవగాహన కలిగించే కార్యక్రమాలు చేపట్టాలని సూచిస్తున్నారు. ఆహార మార్గదర్శకాల్లో ప్రాసెస్‌డ్ ఫుడ్స్ వాడకాన్ని తగ్గించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నారు. మొత్తం చెప్పాలంటే, ప్రాసెస్ చేసిన ఆహారం కాస్త తింటే సరిపోతుంది అనే భ్రమను పూర్తిగా పక్కనపెట్టి, సహజ ఆహారపు అలవాట్లను అలవరచుకోవడమే దీర్ఘకాలిక ఆరోగ్యానికి మార్గమని తాజా అధ్యయనం స్పష్టంగా సూచిస్తోంది.
Read Also: Nara Bhuvaneswari : మహిళల పట్ల వైసీపీ తీరు సిగ్గుచేటు.. సమాజంలో ఇలాంటి వ్యాఖ్యలకు స్థానం లేదు : నారా భువనేశ్వరి