చలికాలంలో నీళ్లు తక్కువగా తాగుతున్నారా? అయితే ఈ ప్రమాదాలు తప్పవు!
టి శాతం తగ్గడం వల్ల మూత్రనాళ ఇన్ఫెక్షన్లు వస్తాయి. దీనివల్ల మూత్రం విసర్జించే సమయంలో మంట, నొప్పి కలుగుతాయి.
- Author : Gopichand
Date : 04-01-2026 - 8:58 IST
Published By : Hashtagu Telugu Desk
Water: చాలా మంది చలికాలంలో మాటిమాటికీ బాత్‌రూమ్‌కు వెళ్లాల్సి వస్తుందన్న భయంతో నీళ్లు తక్కువగా తాగుతుంటారు. కానీ మీ ఈ చిన్న అజాగ్రత్త ప్రాణాంతకం కావచ్చు. సాధారణంగా వేసవిలో చెమట ఎక్కువగా వస్తుంది కాబట్టి మనకు దాహం వేస్తుంది. నీళ్లు ఎక్కువగా తాగుతాం. కానీ చలికాలంలో చెమట రాదు. దాహం కూడా వేయదు. దీంతో చాలా మంది నీళ్లు తాగడం తగ్గిస్తారు. శరీరంలో నీటి శాతం తగ్గడం వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.
నీళ్లు తక్కువగా తాగడం వల్ల ఏం జరుగుతుంది?
కిడ్నీ వ్యాధులు: 2019లో ‘అమెరికన్ హార్ట్ అసోసియేషన్’ జరిపిన పరిశోధన ప్రకారం.. ఎక్కువ కాలం నీళ్లు తక్కువగా తాగితే కిడ్నీ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. శరీరంలో నీటి కొరత వల్ల కిడ్నీలలో టాక్సిన్స్ (వ్యర్థాలు) పేరుకుపోయి రాళ్లు ఏర్పడతాయి.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్: నీటి శాతం తగ్గడం వల్ల మూత్రనాళ ఇన్ఫెక్షన్లు వస్తాయి. దీనివల్ల మూత్రం విసర్జించే సమయంలో మంట, నొప్పి కలుగుతాయి.
హార్ట్ ఎటాక్ లేదా బ్రెయిన్ స్ట్రోక్: శరీరంలో నీరు తగ్గితే రక్తం చిక్కబడుతుంది. దీనివల్ల గుండె రక్తాన్ని పంప్ చేయడానికి ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. ఇది రక్తపోటును పెంచి గుండెపోటుకు దారితీస్తుంది. అలాగే రక్తనాళాలు కుంచించుకుపోవడం వల్ల బ్రెయిన్ హెమరేజ్ లేదా స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది.
జీర్ణక్రియపై ప్రభావం: చలికాలంలో చాలా మందికి మలబద్ధకం సమస్య వేధిస్తుంది. దీనికి ప్రధాన కారణం శరీరంలో నీటి కొరతే. జీర్ణక్రియ సాఫీగా సాగాలంటే తగినంత నీరు అవసరం.
తలనొప్పి- అలసట: ఏ పనీ చేయకపోయినా విపరీతమైన నీరసం, తలనొప్పిగా ఉందంటే మీ శరీరంలో నీరు తగ్గిందని అర్థం.
Also Read: బంగ్లాదేశ్ సంచలన ప్రకటన.. ఐసీసీకి లేఖ!
నీటి కొరత ఉందని తెలిపే లక్షణాలు
- మూత్రం తక్కువగా రావడం లేదా ముదురు రంగులో రావడం.
- మూత్ర విసర్జన సమయంలో మంట.
- నోరు ఎండిపోవడం, విపరీతమైన దాహం.
- కళ్లు లోపలికి పోయినట్లుగా అనిపించడం.
- చర్మం పొడిబారడం.
- గుండె వేగంగా కొట్టుకోవడం.
- కండరాల నొప్పులు, మలబద్ధకం.
నీటి కొరతను ఎలా అధిగమించాలి?
- చలికాలంలో కూడా రోజుకు కనీసం 3 నుండి 4 లీటర్ల నీటిని తాగాలి.
- ఉదయం నిద్రలేవగానే నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి.
- ప్రతి 2 నుండి 3 గంటలకోసారి ఒక గ్లాసు నీరు తాగండి.
- సాయంత్రం 5 గంటల లోపు తగినంత నీరు తాగేలా చూసుకోండి. దీనివల్ల రాత్రిపూట నిద్రలో బాత్‌రూమ్‌కు వెళ్లాల్సిన అవసరం ఉండదు. నిద్ర కూడా చెడదు.