Fasting Benefits: వారంలో ఒక్క రోజు ఉపవాసం ఉంటే ఎన్ని లాభాలో..
పండుగ పర్వదినాలలో ఉపవాసం చేస్తూ ఉంటారు. దైవారాధనలో ఉపవాసాన్ని ఓ దీక్షలా పాటిస్తారు.
- By Maheswara Rao Nadella Published Date - 02:50 PM, Fri - 2 December 22

పండుగ పర్వదినాలలో ఉపవాసం (Fasting) చేస్తూ ఉంటారు. దైవారాధనలో ఉపవాసాన్ని ఓ దీక్షలా పాటిస్తారు. దీని వెనకు ఆధ్యాత్మిక పరమార్ధమే కాదు అతర్లీనంగా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఉపవాసం, పర్వదినాల్లోనే కాకుండా వారానికి ఒక రోజు దీన్ని పాటిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు. ఉపవాసం మన శరీరాన్ని సమతుల్యం చేయడానికి సహాయపడుతుందని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. వారానికి ఒక రోజు ఉపవాసం ఉంటే అనేక అనారోగ్యాలు దూరం అవుతాయి. ఉపవాసం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇపుడు తెలుసుకుందాం.
బరువు తగ్గుతారు:
బరువు తగ్గడానికి వర్కవుట్లు, రకరకాల డైటింగ్ లు చేస్తూ ఉంటారు. వారంలో ఒక్క రోజు ఉపవాసం ఉంటే త్వరగా బరువు తగ్గుతామని నిపుణులు చెబుతున్నారు. ఉపవాసం మన శరీరంలో జీవక్రియను వేగవంతం చేస్తుంది. ఇది బరువు తగ్గించే ప్రక్రియను వేగవంతం చేస్తుందని కొన్ని పరిశోధనలు కనుగొన్నాయి. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి కేలరీలను రిస్ట్రిక్ట్ చేయడం కంటే, ఉపవాసం ఎఫెక్టివ్ గా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
గుండెకు మంచిది:
ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా సంభవిస్తున్న మరణాలకు ప్రధాన కారణం గుండె సమస్యలు. వారానికి ఒకసారి ఉపవాసం చేస్తే గుండె సమస్యల నుంచి రక్షణ లభిస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఉపవాసం మంచి కొలెస్ట్రాల్‌ను పెంచి, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఉపవాసం చేస్తే హైపర్ టెన్షన్ కంట్రోల్‌లో ఉండడంతో పాటు ట్రైగ్లిజరైడ్స్ స్థాయులు కూడా తగ్గుతాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
జీర్ణవ్యవస్థకు మంచిది:
మనం రోజూ ఆహారం తింటూ ఉంటే జీర్ణవ్యవస్థ నిరంతరం పని చేస్తూనే ఉంటుంది. ఉపవాసం జీర్ణవ్యవస్థకు చిన్న బ్రేక్ ఇస్తుంది. దీని వల్ల గట్ హెల్త్ మెరుగుపడుతుంది. వారంలో ఒక్క రోజు ఉపవాసం ఉంటే జీర్ణవ్యవస్థ సమస్యలు దూరం అవుతాయి. ఉపవాసం వల్ల శరీరం తనని తాను రిపేర్ చేసుకుంటుంది.
ఇన్ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది:
దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ కారణంగా మన ఆరోగ్యానికి తీవ్రమైన నష్టం కలుగుతుంది. ఇన్ఫ్లమేషన్ కారణంగా గుండె సమస్యలు, క్యాన్సర్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి తీవ్రమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఉపవాసం ఇన్ఫ్లమేషన్‌ను తగ్గించి ఆరోగ్యాని మెరుగ్గా ఉంచుతుందని అనేక అధ్యయనాలు స్పష్టం చేశాయి.
శరీరం నుంచి వ్యర్థాలు తొలగుతాయి:
మన శరీరంలో టాక్సిన్స్, వ్యర్థ పదార్థాలు పేరుకుని ఉంటాయి. వీటిని శరీరం నుంచి తొలగించడం చాలా ముఖ్యం. వారంలో ఒక్క రోజు ఉపవాసం ఉంటే మన శరీరం నుంచి వ్యర్థ పదార్థాలు తొలగుతాయి. దీని వల్ల మన ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
డయాబెటిస్‌కు చెక్:
వారంలో ఒక్క రోజు ఉపవాసం ఉంటే ఒంట్లో గ్లూకోజు నిరోధకత తగ్గి, డయాబెటిస్ బారినపడే అవకాశాలు తగ్గుతున్నాయని పరిశోధకులు గుర్తించారు. ఉపవాసం రక్తంలో చక్కెరను 3 – 6 శాతం తగ్గిస్తుంది. ఉపవాసం ఇన్సులిన్ స్థాయిలను 20 – 31 శాతం తగ్గిస్తుంది. ఇది టైప్ – 2 మధుమేహం నుంచి రక్షిస్తుంది.
వృద్ధాప్య ఛాయలు త్వరగా రావు:
వారంలో ఒక్క రోజు ఉపవాసం ఉంటే ఏజింగ్ ప్రాసెస్ నెమ్మది అవుతుందని, లైఫ్‌స్పాన్ పెరుగుతుందని ఓ అధ్యయనం వెల్లడించింది. నిర్వహించిన ఒక అధ్యయనంలో, ఎలుకలను ఉపవాసం ఉంచితే ఇతర ఎలుకల కంటే 83% ఎక్కువ కాలం జీవిస్తున్నాయని గుర్తించారు.
ఈ జాగ్రత్తలు పాటించండి:
- కొంతమంది కనీసం నీరు కూడా తాగకుండా ఉపవాసం చేస్తుంటారు. రోజంతా నీరు తాగకపోతే ప్రధాన అవయవాలకు చాలా ప్రమాదం.
- ఉపవాసం (Fasting) ఉన్న తర్వాత రోజు ముందు రోజు ఏమీ తినలేదని ఎక్కువగా తింటూ ఉంటారు. ఇలా చేయడం మంచిది కాదు.