Fact Check : ఓ వర్గం ఇళ్లపై దాడి.. ఈ ఘటన హైదరాబాద్‌లో జరిగిందా ?
తెలంగాణలోని హైదరాబాద్‌లో ఉన్న హిందువుల ఇళ్లలోకి బలవంతంగా అల్లరి మూకలు(Fact Check) ప్రవేశించారంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
- By Pasha Published Date - 07:43 PM, Sun - 2 March 25

Fact Checked By logicallyfacts
ప్రచారం : ‘‘తెలంగాణలోని హైదరాబాద్‌లో హిందువుల ఇళ్లలోకి బలవంతంగా చొరబడటానికి కొందరు అల్లరిమూకలు యత్నించారు. అల్లరిమూకలు ఒక పెద్ద భవనంలోకి ఎక్కడానికి ప్రయత్నించడాన్ని ఇక్కడ చూడొచ్చు’’ అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వాస్తవం : ఈ వీడియోకు సంబంధించి రాసిన మొత్తం సమాచారం అవాస్తవం. ఈ వీడియో 2022 సంవత్సరం నాటిది. ఇందులో పేర్కొన్న హైదరాబాద్ అనేది తెలంగాణ రాష్ట్రంలోనిది కాదు. అది పాకిస్తాన్‌లోని హైదరాబాద్ నగరం. అక్కడ జరిగిన ఓ ఘటనను 2022లో వీడియోలో రికార్డు చేశారు.
ప్రచారం ఏమిటి?
తెలంగాణలోని హైదరాబాద్‌లో ఉన్న హిందువుల ఇళ్లలోకి బలవంతంగా అల్లరి మూకలు(Fact Check) ప్రవేశించారంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఒక ఫేస్‌బుక్ యూజర్ ( ఇక్కడ ఆర్కైవ్ చేయబడింది ) ఈ క్లిప్‌ను హిందీ క్యాప్షన్‌తో షేర్ చేశాడు. దీని అర్థం: “ఈ దృశ్యం ఆఫ్ఘనిస్తాన్ లేదా పాకిస్తాన్‌లోనిది కాదు. తెలంగాణకు చెందింది”. “శరీరం నుంచి తలను వేరు చేయండి’’ అనే నినాదంతో హిందువుల ఇళ్లలోకి అల్లరి మూకలు బలవంతంగా చొరబడుతున్నారు. మిమ్మల్ని మీరు రక్షించుకోండి, లేకపోతే పరిస్థితి కశ్మీర్‌లా మారుతుంది. కశ్మీర్‌లో హిందువులను రక్షించడానికి ఎవరూ వెళ్లనట్టే.. ఏ నాయకుడు, సంస్థ, మీడియా మిమ్మల్ని రక్షించడానికి రారు” అని ఆ వీడియోకు సంబంధించిన క్యాప్షన్‌లో రాశారు.
ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన ఇలాంటి పోస్ట్‌ల ఆర్కైవ్ చేసిన వెర్షన్‌లను ఇక్కడ , ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు .
ఈ వీడియో Xలో కూడా ఇలాంటి వాదనలతో కనిపించింది. ఆ పోస్ట్‌లకు లింక్‌లు ఇక్కడ మరియు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి .

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వైరల్ పోస్ట్‌ల స్క్రీన్‌షాట్ (మూలం: X/Facebook/Screenshot/Modified by Logically Facts)
వాస్తవం ఏమిటంటే ఈ వీడియో 2022 నాటిది. దీన్ని భారతదేశంలో కాకుండా పాకిస్తాన్‌లో రికార్డ్ చేశారని మేం వాస్తవ తనిఖీలో గుర్తించాం.
వాస్తవ తనిఖీలో ఏం తేలింది ?
వైరల్ క్లిప్‌తో మేం గూగుల్‌లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. దీంతో మాకు 2022 ఆగస్టు 22న హిందుస్తాన్ టైమ్స్ అప్‌లోడ్ చేసిన YouTube వీడియో ( ఇక్కడ ఆర్కైవ్ చేయబడింది ) ఒకటి దొరికింది. ఆ వీడియోలో ఇలాంటి సీన్‌లే ఉండటాన్ని మేం గుర్తించాం. దాని క్యాప్షన్‌లో.. ‘‘అశోక్ కుమార్ అనే హిందూ పారిశుధ్య కార్మికుడు దైవదూషణ చేశాడనే ఆరోపణలను ఎదుర్కొన్నాడు. పాకిస్తాన్‌లోని హైదరాబాద్‌లో అల్లరిమూకల సమూహం అశోక్ కుమార్‌పై దాడికి యత్నించారు’’ అని రాశారు.
.webp)
వైరల్ క్లిప్ మరియు హిందుస్తాన్ టైమ్స్ షేర్ చేసిన వీడియో మధ్య పోలిక (మూలం: X/YouTube/Screenshot)
వార్తా నివేదికల్లో..
- పాకిస్తాన్ జర్నలిస్ట్ నైలా ఇనాయత్ కూడా 2022 ఆగస్టు 22న ఈ వైరల్ క్లిప్‌ను ( ఇక్కడ ఆర్కైవ్ చేయబడింది) షేర్ చేశారు, పాకిస్తాన్‌లోని హైదరాబాద్‌లో దైవదూషణ ఆరోపణలు ఎదుర్కొంటున్న హిందూ వ్యక్తి నివాసం వెలుపల జన సమూహం గుమిగూడటాన్ని ఈ వీడియోలో చూడొచ్చని ఇనాయత్ అప్పట్లో పేర్కొన్నారు.
- ఇదే సమాచారంతో గూగుల్ సెర్చ్ చేయగా డాన్ మరియు ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ సహా పలు పాకిస్తాన్ మీడియా సంస్థల వార్తా నివేదికలు మాకు దొరికాయి.ఖురాన్‌ను అపవిత్రం చేశాడనే ఆరోపణలతో అశోక్ కుమార్ అనే పారిశుధ్య కార్మికుడిని పాకిస్తాన్‌లోని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారని ఆ వార్తా నివేదికల్లో ప్రస్తావించారు.
- ‘‘ఖురాన్‌కు చెందిన కాలిపోయిన పేజీలతో పారిశుధ్య కార్మికుడు అశోక్‌ను రబీ ప్లాజా వద్ద ఫిర్యాదుదారుడు బిలాల్ పట్టుకొని పోలీసులకు అప్పగించాడు’’ అని డాన్ పత్రిక కథనంలో ప్రస్తావించారు. ఈ వార్త వ్యాపించిన తర్వాత, కోపంతో ఉన్న ఒక గుంపు ఆ వ్యక్తిని పట్టుకోవడానికి భవనంలోకి చొరబడటానికి యత్నించిందని పేర్కొన్నారు. ‘‘అతడు చేసిన చేష్టతో ముస్లింలందరి మనోభావాలు దెబ్బతిన్నాయి. కానీ అమాయక ప్రజలకు హాని కలిగించాలని దీని అర్థం కాదు’’ అని పాకిస్తాన్‌లోని హైదరాబాద్ SSP అమ్జాద్ అహ్మద్ షేక్ పేర్కొన్నట్లుగా ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ కథనంలో ఉంది.
- 2022లో జరిగిన ఈ సంఘటన గురించి ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ మరియు ANI సహా అనేక భారతీయ మీడియా సంస్థలు కూడా కథనాలను ప్రచురించాయి. ఆ ఘటన పాకిస్తాన్‌లోని హైదరాబాద్‌లో జరిగిందని అప్పట్లో నివేదించాయి.
- ఈ సంఘటన వీడియోలు 2022 ఆగస్టు 22న ‘pakistanihindu’ అనే ఖాతా ద్వారా Instagram లో షేర్ చేశారు. ( ఇక్కడ ఆర్కైవ్ చేయబడింది) .
- ఈ వీడియోలలో ఒకటి “అల్ వహీద్ ఫాబ్రిక్స్” అనే దుకాణాన్ని నీలిరంగు నేపథ్యంలో చూపిస్తుంది. దీన్ని Google Mapsలో సెర్చ్ చేయగా పాకిస్తాన్‌లోని హైదరాబాద్‌లో ఆ దుకాణం ఉందని తేలింది. దీంతో ఈ వీడియో భారతదేశానిది కాదని రుజువైంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోలో ఉన్న షాప్, గూగుల్ మ్యాప్స్‌లో కనిపించే షాప్ పేరు మధ్య పోలిక. (మూలం: ఇన్‌స్టాగ్రామ్/గూగుల్ మ్యాప్స్)
మొత్తం మీద ఆ వైరల్ వీడియోకు పాకిస్తాన్‌లోని హైదరాబాద్‌తో మాత్రమే సంబంధం ఉందని ఫ్యాక్ట్ చెక్‌లో తేలింది.