Ashada Masam 2026: ఆషాఢ మాసంలో భార్య భర్తలు ఎందుకు దూరంగా ఉండాలి?
- Author : Vamsi Chowdary Korata
Date : 09-07-2026 - 3:30 IST
Published By : Hashtagu Telugu Desk
హిందూ సంప్రదాయంలో ఆషాఢ మాసానికి ఒక ప్రత్యేక విశిష్టత ఉంది. ఈ ఏడాది ఆషాఢ మాసం జూలై 15 నుండి ఆగస్టు 12 వరకు ఉండనుంది. ఈ మాసం రాగానే కొత్తగా పెళ్లైన దంపతులను ఒకరికొకరు దూరంగా ఉంచడం, వధువును పుట్టింటికి పంపించడం మన సమాజంలో తరతరాలుగా వస్తున్న ఆచారం. అయితే దీని వెనుక కేవలం సెంటిమెంట్లు, నమ్మకాలు మాత్రమే కాకుండా పూర్వీకులు ఆలోచించిన అద్భుతమైన వైజ్ఞానిక, సామాజిక కారణాలు దాగి ఉన్నాయి. పూర్వకాలంలో ఆషాఢం రాగానే తొలి రుతుపవన వర్షాలు ప్రారంభమయ్యేవి. దీనితో రైతులు ఎంతో బిజీగా పొలం పనులు (వ్యవసాయ పనులు) మొదలుపెట్టేవారు. కొత్తగా పెళ్లైన యువకులు తమ భాగస్వామితోనే ఎక్కువ సమయం గడపడం వల్ల వ్యవసాయ పనులకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో ఈ సాంప్రదాయాన్ని ఒక నియమంగా పెట్టారు.
ఈ ఆచారానికి గల మరో బలమైన కారణం తల్లీబిడ్డల ఆరోగ్యం. ఆషాఢ మాసంలో గర్భం దాల్చితే , సరిగ్గా తొమ్మిది నెలల తర్వాత అంటే మార్చి, ఏప్రిల్ లేదా మే నెలల్లో ప్రసవం జరుగుతుంది. ఆ సమయం భారతదేశంలో మండు వేసవి కాలం . పూర్వకాలంలో ప్రస్తుత కాలంలాంటి ఏసీలు, ఆధునిక వైద్య సదుపాయాలు ఉండేవి కావు. కాబట్టి ఆ తీవ్రమైన ఎండలను, ఉక్కపోతను అప్పుడే పుట్టిన పసిబిడ్డ, ప్రసవించిన తల్లి తట్టుకోవడం చాలా కష్టతరంగా మారేది. ఇది వారి ప్రాణాలకే ప్రమాదంగా పరిణమించే అవకాశం ఉండేది. ఈ ఆరోగ్య సమస్యల నుంచి రక్షణ కల్పించడానికే ఆషాఢంలో భార్యాభర్తలను దూరంగా ఉంచే సంప్రదాయాన్ని మన పెద్దలు తీసుకువచ్చారు.